అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, అభ్యర్థుల ఎంపికలో అక్రమాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అమలాపురంలో సోమవారం నిరసన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమలాపురం వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పిలుపునిచ్చారు. డీఎస్సీ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు, సాధారణ పరిపాలనా లోపాలు కాకుండా పద్ధతి ప్రకారం నిర్వహించిన అర్హులకు కాకుండా, అనర్హులకు కేటాయించడాన్ని నిరసిస్తూ అమలాపురం నల్ల వంతెన వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అమలాపురంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని అన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, ఎస్సీ సెల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలని శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ
అమలాపురం టౌన్: ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అమలాపురంలో ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దీనిని స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి మీనా జెండా ఊపి ప్రారంభించారు. నల్ల వంతెన, ముమ్మిడివరం గేటు సెంటర్ మీదుగా గడియారం స్తంభం సెంటరుకు ర్యాలీ సాగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు ఎీస్పీ మీనా అన్నారు. ఫిట్‌నెస్, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ సందేశాలను ర్యాలీ ద్వారా ప్రజలకు చేరవేశామన్నారు. నిత్య జీవితంలో వ్యాయామం, సైక్లింగ్ వంటి ఆరోగ్యకర అలవాట్లకు ప్రజలు అలవాటుపడాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పోలీస్ అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పిల్లులు, పోలీస్ సిబ్బంది పాల్గొని ఉత్సాహంగా సైకిళ్లు తొక్కారు. ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, దిశ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, మహిళా డీఎస్పీ షేక్ సుభాని అహ్మద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ వి.పుల్లారావు, పట్టణ సీఐ పి.వీరబాబు, ఏఆర్ ఆర్‌ఐలు బ్రహ్మానందం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు యథావిధిగా
పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవనంలో డివిజన్, మండల కేంద్రంలో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తారన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబరుకు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
భజే విఘ్ననాయకా..
అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి (సురేష్) ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయం తలుపులు మూసివేశారు.


