రాజమహేంద్రవరం సిటీ: అధికారంలో ఉన్నపుడు ప్రజల ఆరోగ్యానికి, వైద్యానికీ ఎలా ప్రాధాన్యం ఇచ్చామో, ప్రతిపక్షంలోనూ అలానే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నగరంలో ఆనంద్ నగర్ బెట్టి కాన్వెంట్ రోడ్డులో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నగరంలో 45, 46 డివిజన్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామన్నారు. అవసరమైనవారికి మందులు, ఐ డ్రాప్స్ ఉచితంగా అందజేసినట్టు తెలిపారు. కంటి అద్దాలు అవసరమైన వారికి వారం రోజుల్లో అందజేయనున్నట్టు తెలిపారు. క్యాటరాక్ట్, రెటీనా శస్త్రచికిత్సలు అవసరమైన వారు మార్గాని భరత్ ఫౌండేషన్‌తో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చేయిస్తామన్నారు. వైద్య శిబిరాలతో పాటు జాబ్ మేళా కూడా నిరంతరం చేపడతామన్నారు. ఇప్పటికే రెండు విడతల జాబ్ మేళా చేశామని, మరో 20రోజుల్లో మూడవ విడత జాబ్ మేళా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా గర్భిణులకు ప్రొటీన్ కిట్లు, ఐరన్ సిరప్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, వైఎస్సార్ సీపీ 46వ డివిజన్ ఇన్‌చార్జి కె.మురళీకృష్ణ, 45వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
● ప్రతిపక్షంలో ఉన్నా వైద్య సేవలు
● నేత్ర వైద్య శిబిరంలో రోగులకు
ఐ డ్రాప్స్, మందులు అందజేత
● మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్


