● విద్యుత్ కోతతో తీవ్ర అవస్థలు
● సమస్యలపై ఎంఈఓకు ఫిర్యాదు
నిడదవోలు: ఉపాధ్యాయులకు వేసవి శిక్షణ తరగతులు మండుటెండల్లో నిర్వహించడంతో వారు అల్లాడిపోతున్నారు. మండలంలో సమిశ్రగూడెం జెడ్పీ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో విద్యుత్ సరఫరా లేక ఉపాధ్యాయులు అల్లాడిపోయారు. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 1, 2 తరగతులు బోధించే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. పట్టణంతో పాటు నిడదవోలు రూరల్, చాగల్లు, కొవ్వూరు, ఉండ్రాజవరం మండలాల నుంచి 240 మంది ఉపాధ్యాయులు నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు వరకు హాజరవుతున్నారు. ఆదివారం శిక్షణ ప్రారంభమైనప్పటి నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో వారంతా నానా అవస్థలు పడ్డారు. సరైన తాగునీటి సదుపాయం కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం జనరేటర్ లేదని, నాణ్యత లేని భోజనాన్ని తినలేకపోతున్నామని వారు చెప్తున్నారు. కనీస సదుపాయాలు కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఉపాధ్యాయయులు వారి సమస్యలను ఎంఈఓ గణేష్ దృష్టికి తీసుకువచ్చారు. సర్వశిక్ష అభియాన్ గైడ్‌లైన్స్ ప్రకారం సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సదుపాయాల కల్పనకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఎంఈవో గణేష్ తెలిపారు.


