కొత్త వత్సరానికి స్వాగతం | - | Sakshi
Sakshi News home page

కొత్త వత్సరానికి స్వాగతం

Mar 20 2026 8:21 AM | Updated on Mar 20 2026 8:21 AM

పచ్చని సీమలో...

తెలుగు వెలుగుల ఉషస్సు

గ్రామా గ్రామాన ఉగాది

పర్వదిన వేడుకలు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు,

పంచాంగ శ్రవణాలు

పోటెత్తిన భక్తజన సందోహం

కలెక్టరేట్‌లో శ్రీ పరాభవ నామ

సంవత్సర ఉగాది వేడుక

సాక్షి, అమలాపురం: విశ్వావసు నామ తెలుగు సంవత్సరానికి ఘన వీడ్కోలు పలుకుతూ... శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరానికి జిల్లా వాసులు స్వాగతం పలికారు. ఉగాది వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం అట్టహాసంగా జరిగాయి. పురాతన, చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, గ్రామ, పట్టణాలలో అమ్మవారి ఆలయాలు పూల అలంకరణతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. స్వామివారు, అమ్మవారి దర్శనాలకు భక్తులు బారులు తీరారు. పంచాంగ శ్రవణాలు, వేప పువ్వు పచ్చడి పంపిణీలు, దేవాలయాలలో అభిషేకాలు, అమ్మవారి జాతరలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కలెక్టరేట్‌లో ప్రత్యేక వేడుకలతో జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి అంబరాన్నటింది.

కన్నుల పండువగా అలంకరణ

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలు, పండ్లతో కన్నుల పండువగా అలంకరించారు. అర్చక స్వాములు ఉదయం స్వామివారికి తొలి హారతి, సుప్రభాత సేవ, మహాలక్ష్మి హోమం నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయ అర్చకులు గురువారం పంచాంగ పఠనం చేసి, ఈ ఏడాది రాశుల ఫలితాలను వివరించారు. ఆలయానికి గత సంవత్సరం సుమారు రూ.56 కోట్ల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. పంచాంగాలకు పూజలు నిర్వహించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పంచాంగ శ్రవణాలు.. పండిత సత్కారాలు

రామచంద్రపురం మండలం ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లలితా సహస్ర నామ పారాయణ చేశారు. పండితులను రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌ సత్కరించారు. ఈవో అల్లూ వెంకట దుర్గాభవానీతోపాటు పలువురు పాల్గొన్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకల సందర్భంగా బ్రహ్మశ్రీ నాగాభట్ల వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన వేడుకల సందర్భంగా భక్తులకు పంచాంగాలు పంపిణీ చేశారు. మురళీ కోలాటం, కుచిపూడి నృత్య ప్రదర్శనతోపాటు పండితుల సన్మానం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, ఏసీ ఎం.కె.టి.ఎన్‌.వి.ప్రసాద్‌, ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాస్‌ కిరణ్‌, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు పాల్గొన్నారు. పండగ సందర్భంగా వందలాది మంది భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అయినవిల్లి శ్రీ వర సిద్ధి వినాయకస్వామి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది. శ్రీవారణాశి సేతు మాధవ నర్శింహమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ పఠనం సాగింది.

కలెక్టరేట్‌లో...

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం, వేద పండితుల సన్మాన కార్యక్రమాలతో వేడుకలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పండితులు మాట్లాడుతూ ఈ ఏడాది శ్రమకు తగిన ఫలితాలు, ఆత్మ విశ్వాసం, అభివృద్ధి, కొత్త అవకాశాల వల్ల కలిగే మార్పులను రాశుల వారీగా వివరించారు. జిల్లాలో విద్య, వ్యాపారం, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముందన్నారు. ఆధ్యాత్మికత పట్ల ప్రజలలో మరింత ఆసక్తి పెరిగి దేవాలయ దర్శనాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఏపీసీ, ఆర్డీవో జి.మమ్మీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో నూతన సంవత్సరానికి ప్రతీకగా భావించే ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, సంకల్పాలకు నాంది పలకాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు, దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.దుర్గారావు దొర, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కేశవ వర్మ, జిల్లా ఖజానాధికారి రామనాథం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement