ఆలమూరు: మండలంలోని సంధిపూడికి చెందిన బాలమందిరం నిర్వహించిన జిల్లా స్థాయి కథల పోటీల్లో నలుగురు విజేతలను ఎంపిక చేశారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కంచుకుని నిర్వహించిన ఈ పోటీలకు విశేష సంఖ్యలో కథలు అందినట్టు అధ్యక్షుడు కృష్ణశ్రీ గురువారం తెలిపారు. రామచంద్రపురానికి చెందిన ర్యాలి శ్రీనివాసు రచించిన ఆత్మగౌరవం కథకు (ప్రథమ), ఆలమూరు మండలంలోని పెదపళ్లకు చెందిన గొడవర్తి శ్రీనివాసు రచించిన మైసూర్ మల్లిగే కథకు (ద్వితీయ), ఆలమూరుకు చెందిన ఆకుల సూర్య రచించిన ఉగాది పచ్చడి కథకు (తృతీయ), పి.గన్నవరం మండలంలోని మానేపల్లికి చెందిన కేవీ లక్ష్మణరావు రచించిన ఉభయ కుశలోపరి కథకు (చతుర్థ) స్థానాలు లభించాయి. ఈ కథల పోటీల్లో ఎంపిక చేసిన 18 కథలతో త్వరలోనే పుస్తకాన్ని రూపొందిస్తామని కృష్ణశ్రీ తెలిపారు.
ఉగాది పురస్కారం అందుకున్న
శిల్పి మాధవరావు
ముమ్మిడివరం: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న వారికి ఇచ్చే ఉగాది పురస్కారాన్ని గాడిలంక గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెద్దిరెడ్డి వెంకట కృష్ణ మాధవరావు గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. శిల్పకళలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. సంప్రదాయ శిల్పకళను ఆధునిక శైలితో మేళవిస్తూ ఎన్నో అద్భుత విగ్రహాలను రూపొందించిన మాధవరావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రుముఖల విగ్రహాలను సృష్టిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు.
దళితుడి మృతదేహాన్ని అడ్డుకున్న
10 మందిపై అట్రాసిటీ కేసు
పి.గన్నవరం: మండలంలోని కుందాలపల్లిలో ఈ నెల 16న కాట్రు శ్రీనివాస్ అనే దళితుని మృతదేహాన్ని గ్రామంలోని ప్రధాన రహదారి మీదుగా తీసుకువెళ్లకుండా అడ్డుకున్న, మరొక వర్గానికి చెందిన 10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ విలేకరులకు చెప్పారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పెళ్లి పందిరి ఉందన్న కారణంగా ప్రధాన రహదారిపై తీసుకువెళ్లకుండా కొందరు అడ్డుకున్నారన్నారు. వివాదం అనంతరం మృతదేహాన్ని ప్రధాన రహదారి మీదుగా తరలించి అంత్యక్రియలు నిర్వహించారన్నారు. అయితే మృతదేహాన్ని అడ్డుకోవడం నేరమన్నారు. దీనిపై మర్రి శ్రీనివాస్‌తో పాటు తొమ్మిది మంది ఇచ్చిన ఫిర్యాదుపై పప్పుల లక్ష్మణరావు సహా 10 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. ఇదిలా ఉండగా ప్రధాన రహదారిపై ఉన్న పెళ్లి పందిరిని గురువారం తొలగించారు. కాగా కుందాలపల్లిలో బాధితులను మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం పరామర్శించారు.


