జిల్లాలో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో భారీ వర్షం

Mar 20 2026 8:21 AM | Updated on Mar 20 2026 8:21 AM

ఐ.పోలవరం: జిల్లాలో గురువారం దఫదఫాలుగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన అమలాపురం మధ్యాహ్న సమయంలో తడిసి ముద్దయ్యింది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించి పోయింది. అమలాపురంతోపాటు అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం,ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో మధ్యాహ్నం, రాత్రి వేళ్లల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం భయపెట్టగా, సాయంత్రం ఒక మోస్తరు గాలి, మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడడంతో సామాన్యులు సేద తీరారు. శివారు ప్రాంతాల్లో సాగునీరందక ఇబ్బంది పడుతున్న వరి రైతులకు, ఉద్యాన పంటల రైతులకు వర్షం కాస్త మేలు చేసింది.

మామిడికుదురులో భారీగా..

మామిడికుదురు: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మామిడికుదురు మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉంది. ఉదయం ఎండ కాసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. అంతలోనే భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఉగాది పండుగ సందర్భంగా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి అప్పనపల్లిలో రెండు ప్రధాన రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. మూడు రోడ్ల కూడలి నుంచి స్వామివారి గుడికి వెళ్లే పంచాయతీరాజ్‌ రోడ్డుపై సంతపేటలో మూడడుగుల మేర వర్షం నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. దీంతోపాటు అదే గ్రామంలోని పోస్టాఫీసుకు వద్ద మైనర్‌ రాజుగారి వీధికి వెళ్లే ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డుపై కూడా వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. నీటి మళ్లింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement