ఐదేళ్లలో 120 మందికి పైగా ఆత్మహత్యలు | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 120 మందికి పైగా ఆత్మహత్యలు

Mar 7 2026 7:28 AM | Updated on Mar 7 2026 7:28 AM

అమలాపురం రూరల్‌: ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 120 మందికి పైగా వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కిమ్స్‌ మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్‌ అబ్దుల్‌ సలాం తెలిపారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, క్యూపీక్యూఐ ఇండియా సంస్థల ఆధ్వర్యాన అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మహత్యల నివారణ – గేట్‌కీపర్‌ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సలాం మాట్లాడుతూ, ఆత్మహత్యకు ముందు కొందరు మానసిక వైద్య సహాయం కోరుతున్నారన్నారు. మానసిక క్షోభకు గురైన వారిని తోటి విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు వెంటనే గుర్తిస్తే ఆత్మహత్యలను ఆపగలమని అన్నారు. ఇటువంటి వారికి సహాయం చేసేందుకు 14416 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. యూనివర్సిటీ వైద్యులు తేజోవతి, గిరీష మాట్లాడుతూ, పరీక్షల్లో ఒత్తిడి నిర్వహణ, మానసిక క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం, సహాయం కోరడం, భావోద్వేగ ప్రథమ చికిత్స, సానుకూల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు. డీన్‌ డాక్టర్‌ ఆనంద్‌ ఆచార్య, కిమ్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రేణు మాట్లాడుతూ మన దేశంలో ప్రధానంగా 15–39 ఏళ్ల మధ్య వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్‌ రేఖాకుమారి మాట్లాడుతూ, 2023 నుంచి ఇప్పటి వరకూ 10 వేల మంది మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ఆత్మహత్యల నివారణ – గేట్‌కీపర్‌ శిక్షణ పొందారని తెలిపారు. కార్యక్రమంలో 200 మంది కిమ్స్‌ ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement