ముదురుతున్న రజకుల చెరువు వివాదం
● చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్న ఓ వర్గం
● రూ.1.50 లక్షల విలువైన చేప పిల్లల మృతి
దేవరపల్లి: పేరం చెరువు వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ చెరువులో శుక్రవారం చేప పిల్లలను వేయడానికి రజకులు ఏర్పాట్లు చేయగా, దళితులు అడ్డుకున్నారు. దీంతో రజకులు చనిపోయిన ఆ చేప పిల్లలను పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు రాశిగా పోసి ఆందోళన చేశారు. రజక నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి – బుచ్చియపాలెం రోడ్డులో సుమారు 3.96 ఎకరాల విస్తీర్ణంలో పేరం చెరువు ఉంది. దీన్ని దాదాపు 20 ఏళ్ల క్రితం రజకులకు ప్రభుత్వం కేటాయించింది. చెరువులో రజక వృత్తితో పాటు చేపలు పెంచుకుని ఫలసాయం పొందడానికి డివిజినల్ పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే చెరువులో చేపల పెంపకం విషయంలో రజకులు, దళితులకు మధ్య వివాదం ఏర్పడింది. చెరువులో దుస్తులు ఉతకటానికి మాత్రమే హక్కు ఉందని, చేపలు పెంచడానికి వీలు లేదని చెరువు సమీపంలోని దళితులు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. కాగా.. రజక సంఘం అధ్యక్షులు కొంజర్ల పాలిరాజు, గౌరవాధ్యక్షులు కడెల్లి సుబ్బయ్య, కార్యదర్శి నేతునూరి సుబ్బారావు మాట్లాడుతూ చెరువును శుభ్రం చేసుకుని చేపపిల్లలను వేయడానికి వెళ్లగా, కొందరు అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ చెరువులో చేపలు పెంచుకోవడానికి, బట్టలు ఉతకడానికి పూర్తి హక్కులు తమకు ఉన్నాయని తెలిపారు. సుమారు 1.50 లక్షల విలువైన 1.5 టన్నుల చేపపిల్లలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్.రవి కిషోర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా చెరువులో రజక వృత్తి చేసుకోవడానికి, చేపలు పెంచుకుని ఫలసాయం అనుభవించడానికి రజకులను హక్కు ఉందని చెప్పారు. ఈ సమస్యను రెండు సామాజక వర్గాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు.
ముదురుతున్న రజకుల చెరువు వివాదం


