శివలింగం ఘటనపై బీజేపీ మాట్లాడదేం?
● దేవదాయశాఖ మంత్రి విచారణ జరపాలి
● మాజీ ఎంపీ భరత్ రామ్
రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధ శివాలయంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కపాలేశ్వరస్వామి శివలింగం ధ్వంసమైతే బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో శ్రీకాకుళంలోని శ్రీరామపాద క్షేత్రంలో శివలింగం ధ్వంసమైనప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనల్లో తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేసిందన్నారు. ప్రస్తుతం శివలింగం ధ్వంసమైతే కాతేరు నుంచి మరో శివలింగాన్ని తీసుకుని వచ్చి మూఢంలో నిబంధనలు పాటించకుండా ప్రతిష్ఠించడం సరికాదన్నారు. దీనిపై హిందువులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవదాయశాఖ మంత్రి ఇక్కడికి వచ్చి, సమగ్ర విచారణ చేసి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్, వైస్ ఎంపీపీ శాకా బాబీ, ఉప సర్పంచ్ వల్లు శివ, నాయకులు కర్రి రవీంద్ర, రెడ్డింశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


