బ్లాక్ మార్కెట్‌కు ఎరువులు
● కృత్రిమ కొరత సృష్టిస్తున్న
చంద్రబాబు ప్రభుత్వం
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ధ్వజం
అమలాపురం టౌన్: జిల్లాలో ఎమ్మార్పీ ధరలకు ఎరువులు దక్కడం లేదని, సరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి చంద్రబాబు ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. కాట్రేనికోన మండలానికి చెందిన ఓ మహిళా రైతు ఎమ్మెల్సీని అమలాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసింది. తాను పదెకరాలకు పైనే దేవస్థానం భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నానని, తనకు అతి కష్టంగా రెండే రెండు బస్తాల ఎరువులు దక్కాయని ఆమె ఎమ్మెల్సీ వద్ద వాపోయింది. అనంతరం ఆ మహిళా రైతు అమలాపురంలోని కలెక్టరేట్‌కు వెళ్లి గ్రీవెన్స్‌లో అన్నదాతలకు ఎరువులు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురంలో సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాతలు నేడు బ్లాక్ మార్కెట్‌లో దాదాపు రూ. 200కి పైగానే అదనపు ధరలను చెల్లించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేసినా ప్రభుత్వం మాత్రం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుందని, ఇలాగైతే పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించారు. సాగుకు ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని లేకుంటే రైతుల పక్షాన నిరసన చేపడతామని ఎమ్మెల్సీ హెచ్చరించారు.


