థర్టీ ఫస్ట్ ధమాకా
● క్వార్టర్‌పై రూ.10 అదనం
● సామాజిక మధ్యమాల్లో హల్‌చల్
● ముమ్మిడివరం నియోజకవర్గంలో దోపిడీ
● కీలక నేత వత్తాసు
● సిండికేట్‌లో 30 షాపులు వారివే
సాక్షి, అమలాపురం: ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’... పాత సంవత్సరానికి ముగింపు రోజు. అంతేకాదు మందు బాబులకు పండగ రోజు. మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారులు రెండు చేతులా సంపాదించే రోజు. సాధారణ రోజుల కన్నా సంవత్సరాంతం రెండు, మూడు రెట్లు సాగే వ్యాపారం కోసం మద్యం వ్యాపారులు చేసుకునే ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావు. సందట్లో సడేమియాగా జిల్లాలో మద్యం వ్యాపారులు దోపిడీకి సిద్ధమయ్యారు. ఎమ్మార్పీ కన్నా క్వార్టర్ బాటిల్‌కు అదనంగా సొమ్ము వసూలుకు తెగబడ్డారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కేంద్రంగా ఇప్పటికే మొదలైన ఈ దోపిడీ జిల్లా అంతా విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో మద్యాన్ని అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ దందా సాగుతోంది. క్వార్టర్ బాటిల్‌కు అదనంగా రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ దందాపై ఒక మద్యం ప్రియుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడది హల్‌చల్ చేస్తోంది. మద్యం విక్రయాలు జరిపే ఒక వ్యక్తి మాట్లాడుతూ ‘అదనపు ధర ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రత్యేకమని’ చెప్పడం గమనార్హం. సాధారణంగా బెల్టు షాపుల్లో మద్యం దుకాణాల కన్నా రూ.20 అదనంగా చేసి అమ్మకాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు ధరలు పెంచడంతో వీరు కూడా అదనంగా రూ.30 నుంచి రూ.40 పెంచి విక్రయిస్తున్నారు.
ఆ నేత సోదరుడి హవా..
నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ కీలక నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇక్కడ సిండికేట్ నడుస్తోంది. వీరి ఆధ్వర్యంలో ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లో సుమారు 30 మద్యం దుకాణాల వరకూ ఉన్నాయని అంచనా. దీనిని అడ్డు పెట్టుకుని మద్యం ధరలు పెంచేశారు. మద్యం దుకాణాల కనుసన్నల్లోనే బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం వ్యాపారం కాస్తా మాఫియాగా మారిపోయింది. గతంలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించిన విషయం గమనార్హం.
మిగతా చోట్లా.. అదే బాట
డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున జరిగే వ్యాపారంలో భారీ లబ్ధి ఆశిస్తున్న జిల్లాలోని మిగిలిన మద్యం వ్యాపారులు కూడా ముమ్మిడివరం బాట పట్టే అవకాశముంది. జిల్లా వ్యాప్తంగా మండలాలు, నియోజకవర్గాల వారీగా సిండికేట్‌లు ఏర్పడిన విషయం తెలిసిందే. అంబాజీపేటలో ఒక సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతోంది. గత దసరా పండగ సమయంలో ఇక్కడ జరిగే భేతాళస్వామి ఉత్సవాలకు మద్యం దుకాణాలను బంద్ చేశారు. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు క్వార్టర్‌కు రూ.50 చొప్పున పెంచి మద్యాన్ని డోర్ డెలివరీ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ డోర్ డెలివరీ వ్యాపారం జోరందుకుంది.


