ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణమంటూ ధృత రాష్ట్రునితో సంజయుడు చెబుతాడని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని సోమవారం ఆయన కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కురుపాండవుల మధ్య జరిగిన అనేక చర్చోపచర్చలను ఆయన వివరించారు. ‘‘పాండవుల వద్దకు ధృతరాష్ట్రుని తరఫున సందేశాన్ని తీసుకువెళ్లిన సంజయుడు.. తిరిగి వచ్చి, ధర్మరాజు సహనానికి, సమరానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. ధర్మరాజు మెత్తటి వాడే కానీ, చేతకాని వాడు కాడు. మనశ్శాంతి కోసం విదురుడిని ఆహ్వానించిన ధృతరాష్ట్రుడు.. జరుగుతున్న పరిణామాల వలన తాను నిద్రకు దూరమయ్యానని అంటాడు. ‘బలవంతుడు దండెత్తి వస్తే తగిన సాధనాలు లేని దుర్బలుడు, సంపద కోల్పోయిన వాడు, కాముకుడు, దొంగ– ఈ నలుగురికీ నిద్ర పట్టదు. నీలో ఈ దోషాలు లేవు కదా?’ అని విదురుడు అడుగుతాడు’’ అని వివరించారు. విదురనీతి, సనత్సుజాతీయం భారతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నవని, విదురనీతిని విద్యార్థి దశ నుంచే బోధించాలని సామవేదం అన్నారు. సామాన్య ప్రజలు, సీ్త్రలు సైతం ధర్మరాజు విజయాన్ని కాంక్షిస్తున్నారని ధృతరాష్ట్రునితో సంజయుడు అంటాడని చెప్పారు. కర్ణుడికి బ్రహ్మాస్త్రం పని చేయదని పరశురాముడు శపించడంలో కుల ప్రస్తావన లేదని, మోసంతో విద్యను నేర్చుకోవాలని కర్ణుడు భావించడమే ఆ శాపానికి కారణమని వివరించారు. ‘‘ఇటు ద్రోణ, కర్ణులు, అటు అర్జునుడనే ముగ్గురిలో ఏ ఒక్కరు మరణించినా శాంతి ఉంటుంది. అర్జునుడు, గాండీవం, కృష్ణుడు అనే మూడు శక్తులున్న చోటే జయం ఉంటుంది. నా కొడుకు నా మాట వినడు. నేనేం చేయాలి’’ అంటూ ధృతరాష్ట్రుడు విలపిస్తాడు. స్మరించగానే ధృతరాష్ట్రుని వద్దకు వ్యాసుడు వచ్చి, కృష్ణ మహిమను వివరిస్తాడు. కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వలోకేశ్వరుడని నీకు తెలిసినట్టు నాకెందుకు తెలియదని వ్యాసుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. నీవు అవిద్యలో ఉన్నవాడివి కనుక తెలుసుకోలేకపోతున్నావని వ్యాసుడు చెబుతాడు’’ అని చెప్పారు. ధృతరాష్ట్రుని మించిన శ్రోత లేడని, ఆసక్తికరంగా వింటాడని, లోపలకు ఎన్ని విషయాలు వెళ్తున్నాయో మనకు తెలీదని సామవేదం అన్నారు. పరమాత్మను తెలుసుకోలేకపోవడానికి అవిద్యయే కారణమని చెప్పారు.


