అర్జీలను పారదర్శకంగా పరిష్కరించండి
అమలాపురం రూరల్: ప్రజలు అందించిన ప్రతి అర్జీని పారదర్శకంగా పరిష్కరించాలని జేసీ టి.నిషాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో కొత్త మాధవి, డ్వామా పథక సంచాలకులు ఎస్.మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఆర్‌డీఏ పీడీ జయచంద్ర గాంధీలతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఉపాధి కల్పన, రెవెన్యూ సేవలకు సంబంధించి మొత్తం 280 అర్జీలు వచ్చాయి. జేసీ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే సంకల్పాన్ని సాధించే దిశగా ఎంఎస్‌ఎంఈల ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీలను గడువు లోగా పరిష్కరించాలన్నారు. వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలుచోట్ల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. ఆ పత్రాలను ఎస్పీ పరిశీలించి అర్జీదారులతో మాట్లాడారు. అర్జీదారుల సమక్షంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల సీఐలు, ఎస్సైలతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై గంగాభవాని పాల్గొన్నారు.
జోనల్ స్థాయి స్పెల్‌బీ
పోటీలకు ఎంపిక
అల్లవరం: అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి స్పెల్‌బీ పోటీల్లో దేవగుప్తం ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థి కోలా లీలాశివకార్తిక్ ప్రథమ స్థానంలో నిలిచి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం వేణుగోపాల్ సోమవారం తెలిపారు. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచుకునేందుకు ఎన్‌సీఈఆర్‌టీ వారి ఆధ్వర్యంలో స్పెల్‌బీ పోటీలను నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి లీలా శివకార్తిక్‌కు ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థికి ఆంగ్ల భాషపై తర్ఫీదు ఇచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయులు ఎం.బాలశంకర్, సాయి సుబ్బలక్ష్మిని హెచ్‌ఎం, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీలో
జిల్లా జయకేతనం
సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రారష్ట్‌ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపింయన్‌షిఫ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు.
అర్జీలను పారదర్శకంగా పరిష్కరించండి
అర్జీలను పారదర్శకంగా పరిష్కరించండి
అర్జీలను పారదర్శకంగా పరిష్కరించండి


