అతి వేగానికి ముగ్గురు బలి
● ఎదురెదురుగా బైక్‌లు ఢీకొని ఇద్దరు..
● మంచు వల్ల రోడ్డు కనపడక ఒకరు మృతి
● మరో ఇద్దరికి తీవ్రగాయాలు
తాళ్లరేవు/పి.గన్నవరం: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అతివేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. 216 జాతీయ రహదారిపై కోరంగి వంతెన సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పి.గన్నవరం మండలం కొత్త అక్విడెక్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేటకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామానికి చెందిన కొండ్రు వినయ్‌కుమార్ ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు నుంచి యానాం వైపు వెళ్తున్నాడు. ధవళేశ్వరం వేమగిరికి చెందిన కుందు సతీష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒకే స్కూటీపై యానాం వైపు నుంచి కాకినాడ వెళ్తున్న క్రమంలో ఆ రెండు వాహనాలూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వినయ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, కుందు సతీష్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ధవళేశ్వరం సున్నంబట్టీ వీధికి చెందిన కొమర లక్ష్మీ నీలేకర్, కాకినాడ జగన్నాథపురం గోళీలపేటకు చెందిన సూరాడ అనిల్‌కుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీలో ఉంచారు. అలాగే పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు కొత్తపేటకు చెందిన ఆరి సుమంత్ కుమార్ (25) గ్యాస్ కంపెనీ ఏజన్సీలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతడు మోటారు సైకిల్‌పై తాటిపాకలోని సోదరి ఇంటి వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై శుక్రవారం ఉదయం గ్యాస్ కంపెనీలో విధులకు వెళ్లాల్సిన నేపథ్యంలో తెల్లవారు జామున అక్కడి నుంచి కొత్తపేటకు మోటారు సైకిలుపై బయలుదేరాడు. కొత్త అక్విడెక్టు వద్దకు వచ్చేసరికి అతడి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొని పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంచు వల్ల రహదారి కనపడక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సుమంత్ మృతదేహానికి కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
అతి వేగానికి ముగ్గురు బలి
అతి వేగానికి ముగ్గురు బలి


