అక్రమంగా తరలిస్తున్న 320 తాబేళ్ల స్వాధీనం
ఇద్దరి అరెస్టు
ఏలేశ్వరం: అక్రమంగా రవాణా చేస్తున్న తాబేళ్లను శనివారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అటవీశాఖ రేంజర్ దుర్గా రాంప్రసాద్ తెలిపిన వివరాల మేరకు కోనసీమ జిల్లా రామచంద్రపురం పరిసరాల గ్రామాల నుంచి 18 గోనె సంచుల్లో 320 తాబేళ్లను బోలెరో వాహనంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద వాహనంతో పాటు తాబేళ్లు, ఇద్దరు నిందితులను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను ఏలేరు ప్రాజెక్టులో వదిలిపెట్టారు. నిందితులను ప్రత్తిపాడు కోర్డులో హాజరు పరిచినట్టు ఆయన తెలిపారు.
బ్రిడ్జి నిర్మాణంలో కార్మికుడి మృతి
కాకినాడ రూరల్: ఎన్‌హెచ్ 216 బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పొల్గొన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడు నాబా ముండా (51) మృతి చెందడంతో సర్పవరం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సర్పవరం ఆటోనగర్ వెనక భాగంలోని హైవే వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో నాబా ముండా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పెద్దిరాజు తెలియజేశారు.


