పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయాలి
● బాధితులతో కలసి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి
ఆందోళన
● బిక్కవోలు పోలీసుస్టేషన్ ముట్టడి
● భారీగా తరలి వచ్చిన ప్రజలు
అనపర్తి: పోక్సో కేసులో బిక్కవోలు పోలీసులు నిందితుడికి అండగా ఉండి తమకు అన్యాయం చేశారంటు రంగాపురం గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు శనివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బిక్కవోలు పోలీస్టేషన్‌ను ముట్టడించారు. సాయంత్రం నాలుగు గంటలకు రంగాపురం గ్రామం నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలతో కలసి డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్టేషన్‌కు వెళ్లారు. సిబ్బంది ఎస్సై లేరని చెప్పడంతో వచ్చే వరకు వేచి ఉంటామంటూ స్టేషన్ ఎదురుగా బైఠాయించి బాలికకు న్యాయం చేయాలంటు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కొంత సేపటికి అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్ రావడంతో ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమకు న్యాయం జరగడం లేదంటూ పెద్ద పెట్టున కేకలు వేస్తు బాలిక తల్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను తాగబోతుండగా పక్కన ఉన్న వారు దానిని లాక్కుని ఆమెను శాంతపరిచారు. అనంతరం బాధిత బాలిక తల్లిని సీఐ విచారించారు. ఆరో తరగతి చదువుతున్న తమ కుమార్తైపె టీడీపీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు నంగన వెంకటరమణ కుమారుడు నరశింహ అత్యాచారయత్నం చేశాడని ఫిర్యాదు చేయడానికి వస్తే కేసు నమోదు చేయకుండా మూడు రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పుకొన్నారని, పరిహారం కావాలో, పెళ్లి కావాలో చెబితే చేయిస్తామని అన్నారని తెలిపింది. తమకు న్యాయం కావాలని, కేసు మాత్రమే కావాలంటే ఎస్సై నానా దుర్భాషలాడారని పేర్కొన్నారు. తనను, తన తోటి కోడల్ని స్టేషన్‌లో నిర్బంధించి తన భర్తను బావగారిని, వారి కుమారుడిని జోడినాదాల తూము వద్ద అరెస్టు చేసినట్టు చెప్పారన్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని రాజమహేంద్రవరం జైలుకు రిమాండ్‌కు పంపించారని తెలిపింది. మహిళలైన తమను ఇంటికి పంపించడానికి రూ.10 వేలు తీసుకున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. సుమారు గంటపాటు ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదం చేశారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డితో చర్చించిన సీఐ సుమంత్ బాధితురాలి వాంగ్మూలం ఇంకా స్టేషన్‌కు రాలేదని, వచ్చిన వెంటనే కోర్టు అనుమతితో మారుస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. దీనిపై డాక్టర్ మాట్లాడుతూ ఎస్సై పనితీరు చాలా అభ్యంతరకరంగా ఉంటోందని, ఆయనను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తానని బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో బిక్కవోలు మండల వైఎస్సార్ సీపీ నాయకులు నల్లమిల్లి త్రినాథరెడ్డి, సత్తి హరిప్రసాదరెడ్డి, గుబ్బల లాజర్‌బాబు, పోతుల ప్రసాదరెడ్డి, గువ్వల సత్తిరెడ్డి, కొంకుదురు పీవీ, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి తోట ప్రకాశరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయాలి


