విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప ప్రాంగణం
అంబేడ్కర్ స్మృతివనంలో సర్కారు పారిశుద్ధ్య పనులు
చెత్తాచెదారం, వాటర్ ఫౌంటెయిన్లలో పసరు నీరు తొలగింపు
కంటితుడుపు చర్యలతో సరిపెట్టొద్దని దళిత, గిరిజన సంఘాల ఆగ్రహం
సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్
26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ‘చలో అంబేడ్కర్ విగ్రహం’ కార్యక్రమానికి పిలుపు
సాక్షి, అమరావతి: విజయవాడ సామాజిక న్యాయ మహాశిల్పం అంబేడ్కర్ ప్రాంగణంలో సర్కారు పారిశుద్ధ్య పనులు చేపట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన మహాశయుని మహాశిల్పంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆది నుంచి వివక్ష, నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ‘‘అంబేడ్కర్‌పైనా కూటమి కక్ష!’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించడంతో సర్కారు తీరుపై దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన సర్కారు శుక్రవారం ప్రాంగణంలో హడావుడిగా పారిశుద్ధ్య పనులు చేపట్టింది.
వాటర్ ఫౌంటెయిన్లలో పేరుకుపోయిన పసరు నీటిని తొలగించింది. వాటిని మళ్లీ మంచినీటితో నింపాల్సి ఉంది. ప్రాంగణం మొత్తం పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రంచేయించింది. ఈ చర్యలపై దళిత, గిరిజన సంఘాలు గళమెత్తాయి. కేవలం తాత్కాలిక కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా స్ఫూర్తిదాయకమైన ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీనిని ప్రైవేట్‌పరం చేయకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాయి. సామాజిక న్యాయ మహాశిల్పం పరిరక్షణకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం రోజున ‘చలో అంబేడ్కర్ విగ్రహం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి సర్కారు దృష్టిపెట్టాలి. ఈ ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – అండ్ర మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రజా సంఘాలపై టీడీపీ బురదజల్లడం సరికాదు
సామాజిక న్యాయ మహాశిల్పం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్న ప్రజా సంఘాలు, అంబేడ్కరిస్టులపై టీడీపీలోని కొందరు ఎస్సీ నాయకులు బురదచల్లే తీరు సరికాదు. అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. – శ్వేతా బుడమూరి, సమతా సైనిక దళ్ మహిళా అధ్యక్షులు


