
గోదావర్రీయే..!
ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వారధి వద్ద గోదావరి వరద
సాక్షి, అమలాపురం: గోదావరికి భారీ నుంచి అతి భారీ వరదలు వచ్చే ఆగస్టు నెల కూడా ముగిసింది. కానీ, ఈ ఏడాది చెప్పుకొనే స్థాయిలో వరద మాత్రం రాలేదు. గత జూలై నెల నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు వరద పోటు తగిలింది. తొలి ప్రమాద హెచ్చరిక మాత్రం దాటలేదు. వరద సీజన్ దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ఏడాది తక్కువ ఇన్‌ఫ్లో నమోదు కావడం మున్ముందు ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని సాగునీటి పారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు.
గోదావరికి ఈ ఏడాది మూడు సార్లు వరదలు సంభవించాయి. రెండుసార్లు మాత్రమే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయిలో వరద వచ్చి తగ్గింది మినహా, చెప్పుకొనే స్థాయిలో మాత్రం వరద రాలేదు. ఈ ఏడాది జూలై నెల 12వ తేదీనే గోదావరికి వరద పోటు తగిలింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14వ తేదీన అత్యధికంగా 5,21,185 క్యూసెక్కుల వరకు మాత్రమే మిగులు జలాలు విడిచిపెట్టారు. జూలై 26న మరోసారి వరద స్వల్పంగా పెరిగింది. జూలై 30న 5,86,477 క్యూసెక్కులు వదిలారు. తిరిగి ఆగస్టు 15న మరోసారి వరద రాగా, ఈసారి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే వరకూ వెళ్లింది. ఆగస్టు 22న అత్యధికంగా 13,57,119 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు.
మరోసారి..
వరదల సీజన్ ముగిసిందనుకుంటున్న తరుణంలో.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో మరోసారి వరద తాకింది. ఆగస్టు 30 నుంచి వరద జలాల రాక మొదలవ్వగా, అత్యధికంగా సెప్టెంబర్ ఒకటిన 11,79,236 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు వదిలారు. ఈ సందర్భంలోనూ బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, రెండు రోజులకు ఉపసంహరించుకున్నారు.
తక్కువ ఇన్‌ఫ్లో
గతేడాది జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ మూడు వరకు 2,597.381 టీఎంసీల నీరు ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వచ్చింది. ఇందులో 70.849 టీఎంసీలు డెల్టాలో మూడు ప్రధాన పంట కాలువలకు విడుదల చేయగా, 2,526.532 టీఎంసీల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడిచిపెట్టారు. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ మూడు వరకు వచ్చిన ఇన్‌ఫ్లో కేవలం 2,276.079 టీఎంసీలు మాత్రమే. ఇందులో డెల్టా కాలువలకు 80 టీఎంసీల నీరు విడుదల చేయగా, 2,196.079 టీఎంసీల నీటిని మాత్రమే దిగువకు వదిలారు. గతేడాదితో పోల్చుకుంటే ఇన్‌ఫ్లో 321.302 టీఎంసీల తక్కువ కావడం గమనార్హం.
మళ్లీ పోల‘వరమే’..
గోదావరికి ఇన్‌ఫ్లో తక్కువగా ఉంటే గోదావరి డెల్టాలో వచ్చే రబీకి కష్టకాలమే. ప్రస్తుత ఇన్‌ఫ్లో ఎనిమిది లక్షలకు పైబడి ఉన్నా, వరద తగ్గిన తరువాత నీటి రాక తగ్గిపోతోంది. గతేడాది ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉన్నా రబీలో నీటి ఎద్దడి తప్పలేదు. ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ నెలాఖరున రబీ పూర్తయ్యే వరకు రైతులు నీటి కోసం ఇక్కట్లు పాలైన విషయం తెలిసిందే. గత రబీ సాగుకు 91.35 టీఎంసీల నీరు అవసరమని లెక్క కట్టిన అధికారులు సీలేరు పవర్ జనరేషన్ నుంచి రబీ కాలంలో 44.95 టీఎంసీలు, అత్యవసర సమయంలో బైపాస్ పద్ధతిలో మరో 22.95 టీఎంసీలు సేకరించాలని నిర్ణయించారు.
సహజ జలాల లభ్యత 9.45 టీఎంసీలు కాగా, పోలవరంలో 14 టీఎంసీలు ఉంటోందని లెక్కలు కట్టారు. ఇలా మొత్తం 91.35 వస్తోందంటున్నారు. అంతకన్నా అధికంగా నీరు వచ్చినా రబీకి ఎద్దడి తప్పలేదు. గతేడాది కన్నా ఈ ఏడాది ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడంతో రబీ కాలంలో సహజ జలాలు మరింత తగ్గుతాయని అంచనా. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం స్పిల్ వేకు గేట్లు పెట్టడం వల్ల అక్కడ నీటి నిల్వకు అవకాశం కలిగింది. దీనివల్ల రబీకి పూర్తి స్థాయిలో ఎద్దడి రాకుండా కాపాడుతోందని ఆయకట్టు రైతులు భరోసాతో ఉన్నారు.
మూడుసార్లు వరదొచ్చినా..
గతేడాది కన్నా తక్కువ ఇన్ ఫ్లో
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గతేడాది
ఇదే రోజుకు 2,597 టీఎంసీల రాక
దిగువకు 2,526 టీఎంసీల విడుదల
ఈ ఏడాది 2,276
టీఎంసీలు మాత్రమే..
సముద్రంలోకి విడిచిపెట్టింది
2,196 టీఎంసీలు
ఇలాగైతే రబీకి కష్టమే
అంటున్న ఇరిగేషన్ నిపుణులు
గతంలో తొలి హెచ్చరికతో సరి
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒక ఏడాది తొలి ప్రమాద హెచ్చరికతో వరద ఆగిపోవడం అరుదైన విషయమే. గతంలోనూ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ సమయానికి ఇంతకన్నా తక్కువ ఇన్ ఫ్లో కూడా నమోదైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గేట్లు ఏర్పాటు చేసి, నీటిని నిల్వ చేయడం వల్ల రబీకి ఇబ్బంది లేకుండా ఉంది. అధికారులు ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుంటే రబీలో నీటి ఎద్దడి తప్పదు.
– విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్ ఎస్‌ఈ, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్, జిల్లా పరిషత్ చైర్మన్

గోదావర్రీయే..!

గోదావర్రీయే..!