
చవితి వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి
అమలాపురం టౌన్: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీలు విధిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. ఈ మేరకు శనివారం స్థానిక విలేకర్లకు ఆయన వివరాలు వెల్లడించారు. ఉత్సవ పందిర్ల ఏర్పాటుకు పోలీసుల అనుమతిని కోరుతూ సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్లు, మండపాల ఏర్పాటుకు 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా నియమించుకుని ఆ వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందించి అనుమతి పొందాలన్నారు. అగ్నిమాపక, విద్యుత్ శాఖల అనుమతి పత్రం విధిగా ఉండాలని తెలిపారు. విద్యుత్ తీగలు, దీపాల వినియోగంలో షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వినాయక విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవాలు నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, మార్గం, ఉపయోగించే వాహన వివరాలు విధిగా పోలీసులకు తెలియజేయాలి. లౌడ్ స్పీకర్లను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ, రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. పందిర్ల వద్ద, నిమజ్జన ఊరేగింపుల్లో అసభ్య ప్రదర్శనలు ఉండకూడదని ఎస్పీ సూచించారు.