
వాహన విని‘యోగం’
రాయవరం: జీవనశైలి మారింది.. ప్రతి పనిలోనూ వేగం పెరిగింది.. అందుకు అనుగుణంగా వాహనాల విని‘యోగం’ అధికమైంది. జిల్లాలో ఇంటికో ఏదొక వాహనం కనిపిస్తుంది. బండెక్కి బయటకు, షి‘కారు’కు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యక్తిగత అవసరాలకూ వీటిని ఎక్కువగా కొంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు కారు అంటే.. అబ్బో అనేవారు. కరోనా అనంతరం జీవనశైలిలో మార్పులు బాగా వచ్చాయి. మధ్యతరగతి కుటుంబాలు సైతం చిన్న బడ్జెట్‌లో కార్లు కొనుగోలు చేస్తున్నాయి. వివిధ కంపెనీలు కూడా బడ్జెట్‌లో కార్లను తీసుకు వస్తున్నాయి. వారాంతాల్లో సరదాగా గడిపేందుకు, వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వాటిని వాడుతున్నారు. ఇలా జిల్లాలో కార్ల సంఖ్య 47,105కు చేరింది. ఇదిలా ఉంటే కార్లను అద్దెకు ఇచ్చే సంస్కృతి పెరుగుతోంది. పట్టణాల్లో ఉన్న ఈ సంస్కృతి గ్రామాలకూ వచ్చింది. కారు నడపాలనే ఆసక్తి ఉన్నవారు అద్దె కార్లు తీసుకుని షి‘కారు’కు వెళ్తున్నారు.
బైకులదే ‘సోకు’..
ఏటేటా జిల్లాలో ద్విచక్ర వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఏడాదికి సగటున సుమారు 25 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఈ–బైకుల వాడకం రెండేళ్లుగా బాగా పెరిగింది. చమురు ధరలు పెరిగిన తరుణంలో ఇవే ప్రత్యామ్నాయం అయ్యింది. యువత, వివిధ రంగాలకు చెందిన వారూ ఆధునిక వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు బైకులు, స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫైనాన్స్ సౌకర్యం కూడా వచ్చిన తర్వాత ఈ వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు సమయం, ఖర్చు ఆదా చేసుకునేందుకు ఈ–బైకులను కొనుగోలు చేస్తున్నారు. సాగులో యాంత్రీకరణ పెరిగింది. కూలీల కొరత, వివిధ అవసరాల దృష్ట్యా అన్నదాతలు ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. వరి నాట్లు, కోతలు, మాసూళ్లకు కూడా ఈ యంత్రాలనే వినియోగిస్తున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, మట్టి, ఇసుక తరలింపు తదితర పనులకు ట్రాక్టర్లను వాడుతున్నారు.
ఆటోలదే హవా..
స్థానికంగా ఉపాధిని పొందేందుకు పలువురు ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. గూడ్స్, ప్యాసింజర్ ఆటోలపై వేలాది మంది ఆధారపడ్డారు. పలువురు పార్ట్ టైమ్‌గా వినియోగిస్తున్నారు. జిల్లాలో పట్టణాలతో పాటు, పల్లెల్లోనూ ఆటోల వినియోగం అధికమైంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ:
రవాణా శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల సంఖ్య అధికంగా ఉంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల సంఖ్య 4,47 లక్షలుగా ఉండగా, ట్రాన్స్‌పోర్టు వాహనాల సంఖ్య 44,392 వరకూ ఉంది. జిల్లాలో నెలకు 2,500 నుంచి మూడు వేల వరకూ మోటార్ సైకిళ్లు కొనుగోలు చేస్తుండగా, నెలకు 200 వరకు కార్లను కొంటున్నారు. ఈ లెక్కన ఏడాదికి 30 వేలకు పైబడి నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
కాలుష్యం.. ఆపై ట్రాఫిక్
వాహనాల వినియోగం పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే వాయు కాలుష్యం అధికమవుతోంది. కొందరు కాలం చెల్లిన వాహనాలను ఇంకా నడుపుతున్నారు. వ్యక్తిగత వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. ట్రాఫిక్ నిబంధనలపై తరచూ కౌన్సెలింగ్ ఇస్తూ రద్దీని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని అధికారులు గుర్తించాలి.
ఫ జిల్లాలో బైక్‌లు, కార్లదే హవా
ఫ భారీగా పెరిగిన విక్రయాలు
ఫ మొత్తం 4.91 లక్షల వాహనాలు

వాహన విని‘యోగం’