
సమగ్ర మార్పులతో కొత్త బార్ విధానం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకు రావడమే లక్ష్యంగా కొత్త బార్ విధానం తీసుకు వచ్చిందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్‌శర్మ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో కొత్త బార్ పాలసీ, నవోదయం 2.0 పనితీరుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దేవ్‌శర్మ మాట్లాడుతూ ఈ పాలసీ బార్ లైసెన్సుల మంజూరులో ఆన్‌లైన్ విధానం, ఎంపిక ప్రక్రియలో సమానత్వం పాటిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 840 బార్లు ఉండగా, దీనిలో ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. ఇందులో భాగంగా 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ.55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే రూ.75 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని అన్నారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఫీజులు పెంచుతామన్నారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని, ఇక ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుందని అన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 28న కలెక్టర్ లాటరీ తీసి బార్లు కేటాయిస్తారని, సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజా ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా సారా వ్యాపారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మూడు కన్నా ఎక్కువ సారా కేసుల్లో ఉన్నవారిపై పీడీ యాక్ట్ విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎకై ్సజ్ అధికారులు తమ తమ కార్యాలయాల్లో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, సీనియర్ అధికారులతో రాత్రిపూట గస్తీ చేయాలని ఆదేశించారు. సారా వినియోగంతో అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాల్లో విస్తృత దాడులు చేపట్టి సారా రహిత జిల్లాలుగా ప్రకటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళీ, అసిస్టెంట్ కమిషనర్ రేణుక, ఎకై ్సజ్ జిల్లా అధికారులు చింతాడ లావణ్య, ఎస్‌కేవీడీ ప్రసాద్, ఏఈఎస్‌లు నాగరాహుల్, రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.