
ఒరిగిన పిల్లర్ సరిచేసేందుకు కాంట్రాక్ట్ ఖరారు
మలికిపురం: కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్‌లో భాగంగా దిండి– చించినాడ వద్ద వశిష్ట నది మధ్య నిర్మించిన రైల్వే వంతెనలో ఒక పిల్లర్ సుమారు రెండు నెలల కిందట ఒరిగిన సంగతి పాఠకులకు విధితమే. ఈ పిల్లర్‌ను సరి చేసేందుకు ముంబయి కంపెనీకి కాంట్రాక్టు ఖరారు అయ్యింది. ఈ వారంలోనే పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, వరదల వల్ల వాయిదా పడింది. వరద తగ్గిన తరువాత పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నదిలో ఓ వైపునకు 45 డిగ్రీల మేర ఒరిగిన ఈ వంతెన పిల్లర్‌ను తిరిగి యథాస్థానంలో ఉంచేందుకు ముంబయి కంపెనీ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లు ఒరిగిన పిల్లర్ పరిస్థితిని అధ్యయనం చేశారు. దీనిని సరి చేయడానికి దాదాపు రూ. కోటి వరకూ ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాతో కాంట్రాక్టు ఖరారైనట్లు ఆ వర్గాలు తెలిపారు. ఈ ఖర్చు అంతా కూడా ప్రస్తుత కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వంతెన నిర్మాణంలో ఆఖరు పిల్లరు ఇది భూ గర్భంలోకి వెళ్లే సమయంలో బురద బ్లో అవుట్ సంభవించి ఒరిగిపోయింది. స్థానిక కాంట్రాక్టు ఇంజినీర్లు అప్రమత్తమై రైల్వే ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో వారి సూచనల మేరకు డిజైన్ చేసి పిల్లర్ సరిచేసి యథాస్థానంలో ఉంచే విధంగా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ మేరకు అనుభవం ఉన్న ముంబయి కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. సుమారు 23 మీటర్ల ఎత్తు గల ఈ పిల్లర్ నదిలో ఒరిగిపోయింది. నదిలో మరో 50 మీటర్ల లోతు వరకూ వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ 23 మీటర్ల పిల్లర్ నిర్మాణానికి ఇప్పటి వరకూ దాదాపు రూ. 5 కోట్ల ఖర్చు అయ్యింది.
రూ.కోటితో పనులకు
ముంబయి సంస్థకు అప్పగింత