
‘వాన’సీమ
సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక తొలిసారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోనసీమ జిల్లాలో మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కుంభవృష్టిని తలపించేలా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో జన జీవనం స్తంభించింది. వర్షం ధాటికి పట్టపగలే చీకట్లు కుమ్ముకున్నాయి. వర్షంతో జిల్లా కేంద్రమైన అమలాపురం తడిసి ముద్దయింది. అమలాపురం బస్టాండ్ నీట మునిగింది. భారీ వర్షానికి బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వందలాది మంది ఉండిపోవడంతో బస్టాండ్ కిక్కిరిసింది. అమలాపురంలో గడియార స్తంభం సెంటర్, ఈదరపల్లి వంతెన, అశోక్ నగర్, నల్లవంతెన ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అమలాపురంతో పాటు, జిల్లాలో పలు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరింది. రికార్డులు ముంపు బారిన పడకుండా పోలీసులు హైరానా పడ్డారు. మామిడికుదురు–నగరం 216 జాతీయ రహదారిపై మోకాలు లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. రావులపాలెం బస్టాండ్‌లోనూ నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంబాజీపేట, పి.గన్నవరం, తాటిపాక, మలికిపురం, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో రోడ్లు, పల్లపు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి జలమయమైంది. ముమ్మిడివరంలో మోటార్ సైకిళ్లు నీట మునిగాయి. స్థానిక జీఎంసీ బాలయోగి కాలనీ నీట మునిగి, రోడ్లకు అడ్డంగా చెట్లు కూలాయి.
ముమ్మిడివరంలో 12 సెం.మీ.
జిల్లాలోని ముమ్మిడివరంలో ఏకంగా 12 సెం. మీ. వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సగటున 70.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. తర్వాత అత్యధికంగా అంబాజీపేటలో 112.6 మి.మీ., ఐ.పోలవరం 108.8, పి.గన్నవరం 97.4, అమలాపురం 92.6, రావులపాలెం 90.2, మామిడికుదురు 90, అయినవిల్లి 86, ఆలమూరు 84.2, కె.గంగవరం 81.2, ఉప్పలగుప్తం 78.8, కొత్తపేట 77.6, ఆత్రేయపురం 76.6, కపిలేశ్వరపురం 74.8, అల్లవరం 70.2, రామచంద్రపురం 68.2, కాట్రేనికోన 60, రాయవరం 40.2, మండపేట 20.6, రాజోలు 10,4, మలికిపురం 10.2, సఖినేటిపల్లి 9.2 మి.మీ. చొప్పున వర్షం కురిసింది.
జిల్లాలో మూడు గంటల పాటు
ఏకధాటి వర్షం
అమలాపురంలో రోడ్లు జలమయం
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
జనజీవనం అస్తవ్యస్తం