
ధూమపానంపై చిన్నారుల పోరాటం
రాయవరం: పొగాకు వినియోగంపై చిన్నారుల ద్వారా పెద్దల్లో మార్పు తెచ్చే ప్రయతానికి నాన్ కమ్యూనల్ డిసీజెస్(ఎన్‌సీడీ) విభాగం శ్రీకారం చుట్టింది. పొగాకు ఉత్పత్తుల వాడకంతో అనర్థాలు, వ్యాధులపై పొగాకు బానిసల్లో మార్పు తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సుమలత పర్యవేక్షణలో ఎన్‌టీసీపీ(నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం) సోషల్ వర్కర్ కె.ప్రమీల ఆధ్వర్యంలో విద్యా శాఖ సహకారంతో అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ మేరకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నియంత్రణలో భాగంగా వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టారు.
విద్యార్థుల ద్వారా చైతన్యం
పొగాకుతో కలిగే అనర్థాలు, దుష్ప్రభావాలపై తొలుత విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గత నెల ఒకటి నుంచి 22వ తేదీ వరకు నిర్వహించారు. పాఠశాలల్లోని 7, 8, 9 తరగతుల విద్యార్థులకు వివరించి, ధూమపానానికి వ్యతిరేకంగా ఉంటామంటూ వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు, ఇరుగు పొరుగు వారితోనూ ధూమపానం చేయమంటూ విద్యార్థులు సంతకాలు సేకరించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 4,172 మంది విద్యార్థులు 21,777 మంది సంతకాలను సేకరించారు.
డీ–అడిక్షన్ సెంటర్
ధూమపానం అలవాటు నుంచి బయట పడాలనుకునే వారి కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మానసిక ఆరోగ్య వైద్య నిపుణుల(సైకియాట్రిస్ట్) పర్యవేక్షణలో చికత్స అందిస్తారు. ప్రతి నెలా 250 మంది వరకు డీ–అడిక్షన్ సెంటర్‌కు వస్తున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ప్రతి మండలం నుంచి ముగ్గురు
ధూమపానాన్ని మాన్పించేందుకు విద్యార్థులతో పెద్దలకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారులు చెబితే పెద్దలు వింటారనే ఆలోచనతో ఎన్‌టీసీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అధిక సంఖ్యలో సంతకాలను సేకరించిన విద్యార్థుల్లో ప్రతి మండలం నుంచి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేశారు. ఇలా జిల్లాలో 22 మండలాల నుంచి 66, మూడు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ నుంచి ముగ్గురి వంతున 13 మందిని ఎంపిక చేశారు. వీరికి స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్కూల్ బ్యాగ్స్‌ను బహుమతిగా అందించనున్నట్టు చెబుతున్నారు.
ఎన్‌సీడీ పర్యవేక్షణలో కార్యక్రమం
అవగాహన కల్పించి
పెద్దలతో సంతకాల సేకరణ
మంచి ప్రతిభ చూపిన
విద్యార్థులకు బహుమతులు