వాడపల్లికి 96 ఆర్టీసీ బస్సులు | - | Sakshi
Sakshi News home page

వాడపల్లికి 96 ఆర్టీసీ బస్సులు

Jun 26 2025 6:15 AM | Updated on Jun 26 2025 12:05 PM

అమలాపురం రూరల్‌: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో కొలువైన వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రతి శనివారం 96 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్‌టీపీ రాఘవ కుమార్‌ తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి 22 ప్రత్యేక బస్సు సర్వీసులతో పాటు రావులపాలెం నుంచి వాడపల్లికి 8 బస్సులు తిరుగుతున్నాయన్నారు. 

ఇతర జిల్లాల నుంచి వచ్చే వాటితో కలిపి సుమారుగా 96 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, డీడీవో డి.శ్రీనివాసరావు సూచనల మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం రావులపాలెం నుంచి వాడపల్లికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

జిల్లాలో 7.1 మిల్లీమీటర్ల వర్షపాతం

అమలాపురం రూరల్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకూ పడుతూనే ఉంది. చినుకులతో మొదలై, ఒక మోస్తరు నుంచి భారీగా కురిసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా సగటు 7.1 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా ఆత్రేయపురం, రామచంద్రపురం మండలాల్లో 17.1 మిమీ, అత్యల్పంగా మండపేటలో 1.4 మిమీ కురిసింది. మండలాల వారీగా కొత్తపేటలో 11.4, ఆలమూరు 10, అయినవిల్లి 9.8, రావులపాలెం 8.6, మలికిపురం 8.4, సఖినేటిపల్లి 8.4, కపిలేశ్వరపురం 6.4, కె.గంగవరం 6.2, పి.గన్నవరం 5.8, అమలాపురం 4.2, రాజోలు 5.4 ముమ్మిడివరం 5.4, అల్లవరం 4.6, కాట్రేనికోన 4.6, మామిడికుదురు 3.8, ఉప్పలగుప్తం 3.6, ఐ.పోలవరం 4.6, అంబాజీపేట 1.8, రాయవరం 1.2 మిల్లీమీటర్లు చొప్పున నమోదైంది.

ఏపీ పీజీ సెట్‌లో అధ్యాపకుడికి మొదటి ర్యాంకు

అమలాపురం రూరల్‌: ఏపీ పీజీ సెట్‌లో 2025 (అసెట్‌) ఫలితాలలో అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, ఫిజిక్స్‌ అధ్యాపకుడు కేవీవీఎస్‌ మనోహర్‌ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఫిజికల్‌ సైన్స్‌ విభాగంలో 91/100 మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. ఎమ్మెస్సీ, ఎంకామ్‌, ఎంఏ, ఎంఈటీలలో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో 13 యూనివర్సీటీలు కలిపి ఈ సెట్‌ నిర్వహించాయి. ఆయనతో పాటు ఆ కళాశాల విద్యార్థులైన ఎ.సతీష్‌ 220, సీహెచ్‌ ప్రసాద్‌ 320 ర్యాంకులు సాధించారు. కాగా.. మనోహర్‌ను కరస్పాండెంట్‌ కేవీఆర్‌ నరసింహారావు, చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, సీనియర్‌ అధ్యాపకుడు వరప్రసాద్‌ అభినందించారు.

రేపు జాబ్‌మేళా

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధికల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మెడిప్లస్‌, జేవీఎస్‌ టెక్నాలజీ, శ్రీభవానీ కాస్టింగ్‌, ఇన్నోసోర్స్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, పేటీఏం సంస్థలు 615 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి అపై విద్యార్హతల గల అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వివరాలకు 86398 46568 నెంబరులో సంప్రదింవచ్చన్నారు.

ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలి

కాకినాడ క్రైం: పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, అందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలలపై చోటు చేసుకుంటున్న నేరాలను నియంత్రించాలన్నారు. హైవేలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయాలన్నారు. మిస్సింగ్‌ కేసులు, సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కుటుంబ కలహాల్లో పరస్పర దాడులు జరగకుండా చూడాలన్నారు. ఆస్తుల చోరీల్లో రికవరీలు పెంచాలన్నారు. డ్రోన్ల సాయంతో శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా పెంచాలని సూచించారు. గంజాయి నిందితులను గుర్తించి నేరాల బాట పట్టకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఏలూరు ఐజీపీ జీవీజీ అశోక్‌కుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement