చంపుతాడని చంపేశాడు

Younger Brother Killed His Brother In Kamareddy District - Sakshi

అన్నని చంపిన తమ్ముడు

వదినతో వివాహేతర సంబంధమే కారణం

నిజాంసాగర్‌: అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బయటికి తెలియడంతో తనను ఎక్కడ చంపేస్తాడోనన్న భయంతో అన్ననే మట్టుపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని అంతాపూర్‌లో జరిగింది. బిచ్కుంద పోలీస్‌ స్టేషన్‌లో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి శనివారం తెలిపిన వివరాలిలా.. అంతాపూర్‌ గ్రామనికి చెందిన మక్కల్‌ వాడి గంగాధర్‌(27).. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్నమ్మ వద్దనే పెరిగాడు.

చిన్నమ్మ కుమారుడు గంగాధర్, మక్కల్‌వాడి గంగాధర్‌ సొంత అన్నదమ్ముళ్లలా పెరిగారు. మక్కల్‌వాడి గంగాధర్‌కు వివాహమైంది. భార్య రేణు, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతను కూలి పనుల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో వరుసకు వదిన అయిన రేణుతో గంగాధర్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం క్రితం ఇంటికి వచ్చిన మక్కల్‌వాడి గంగాధర్‌.. ఇది గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీంతో తనను అన్న చంపేస్తాడేమోనని భయపడి ముందుగా అతడినే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు మక్కల్‌వాడి గంగాధర్‌ వంట చెరుకు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. తమ్ముడు గంగాధర్‌ బైక్‌పై అతడి వద్దకు వచ్చి, పొలానికి వెళ్దామని చెప్పాడు. జుక్కల్‌ మండలంలోని హంగర్గ శివారులోగల కర్ణం గుట్టకు తీసుకువెళ్లాడు. అక్కడ మాటు వేసి ఉన్న తన మిత్రులు అశోక్, బాలాజీలు మక్కల్‌వాడి గంగాధర్‌పై బండరాళ్లతో దాడి చేశారు.

కుప్పకూలిన అతని తలపై ముగ్గురూ కలిసి రాళ్లతో కొట్టి చంపి నీటి గుంటలోకి తోసివేసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం వేళ అన్న కనిపించడం లేదంటూ గంగాధర్‌ గ్రామస్తులకు తెలిపాడు. హంగర్గ శివారు ప్రాంతానికి వెళ్లినవారికి నీటి గుంటలో మక్కల్‌వాడి గంగాధర్‌ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. బిచ్కుంద సీఐ కృష్ణ, జుక్కల్‌ ఎస్సై మురళి ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ జరిపారు. గంగాధర్‌పై అనుమానంతో  విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top