ఒంగోలు: ఎన్‌ఏపీ రిజర్వాయర్‌లో షేక్ ఆయేషా (22) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు రమ్మన్నారని సోమవారం ఆయేషా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం ఎన్‌ఏపీ రిజర్వాయర్ నుంచి ఫిల్టర్ బెడ్‌లకు నీరు వెళ్లే గోడల మధ్య మృతదేహం బోర్లా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శవ పంచనామా నిర్వహించి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు. ఆయేషా డిగ్రీ చదివింది. తండ్రి రెడిమేడ్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు.
మృతిపై అనుమానాలు
ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతురాలిని స్కూటీపై ఎక్కించుకుని వెళ్లాడని, అక్కడ మరొకరితో కలిసి ముగ్గురు మాట్లాడుకుంటున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆయేషా నైట్ డ్రెస్‌లో ఉంది. ఎడమకంటిపై దెబ్బలు ఉన్నాయి. డ్రెస్ చిరిగి ఉంది. మృతదేహం ఉన్న పరిస్థితులు చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయేషా వెళ్లిన స్కూటీ ఎవరిది? అసలు ఆమెకు ఫోన్ చేసింది ఎవరు? ఆక్కడ ఉన్న మరో వ్యక్తి ఎవరన్న విషయాలు ప్రశ్నార్థకంగా మారాయి. మృతురాలిది ఆత్మహత్య? హత్య? అన్న విషయాలు మిస్టరీగా మారాయి. పోస్టుమార్టం రిపోర్ట్, పోలీసుల దర్యాప్తు ఆధారంగా అసలు విషయాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా కుమార్తెను చంపేశారు
తన కుమార్తెను చంపేశారని ఆయేషా తండ్రి షేక్ రహమత్ బాషా ఆరోపించారు. స్నేహితులు ఫోన్ చేయగా బయటకు వెళ్లినట్లు తెలుసుకున్నామన్నారు. మధ్యాహ్నం వెళ్లిన అమ్మాయి సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశామన్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందని, సాయంత్రం వరకు అమ్మాయి ఇంటికి రాలేదన్నారు. సాయంత్రం 7 గంటలకు ఫిర్యాదు చేద్దామని పోలీసుస్టేషన్‌కు వెళ్లగా ఎస్సై లేరని చెప్పారన్నారు. 9 గంటల వరకు ఉండి తమ కుమార్తె కనిపించడం లేదని ఎస్సైకి ఫిర్యాదు చేశామన్నారు. తెల్లవారిన తర్వాత ఎన్‌ఏపీ చెరువు వైపు వెళ్లగా అక్కడ స్కూటీ కనిపించిందని పేర్కొన్నారు. కొందరు గొర్రెలు కాసుకునే వారు తమ కుమార్తెతో మరికొందరు ఇక్కడ ఉన్నట్లు చూశామని చెప్పారన్నారు. తమ కుమార్తె గొంతు నులిమినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కంటిపై దెబ్బ తగిలి ఉందని, చేయి విరిగిందని, కాలు వద్ద గీసుకుపోయిందన్నారు. ఎవరో తన కుమార్తెను హత్య చేశారని, తమకు న్యాయం చేయండి.. అంటూ కన్నీరుమున్నీరై విలపించారు.
ఇదీ చదవండి: రెండు తలల పాము రూ.కోటి


