కానిస్టేబుల్‌ వేధించాడని యువకుడి ఆత్మహత్య

Young Man Selfie Suicide Alleges Police Constable Torture At East Godavari - Sakshi

సెల్ఫీ వీడియో కలకలం 

రాజమహేంద్రవరం రూరల్‌: పోలీసు బెదిరింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ యువకుడు.. తన ఫ్రెండ్స్‌కు పంపిన సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. హాయ్‌ ఫ్రెండ్స్‌.. అంటూ ప్రారంభమైన వీడియోలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఏకరువు పెట్టాడు ఆ యువకుడు. వివరాలిలా ఉన్నాయి..  రాజమహేంద్రవరం రూరల్‌ మండలం వెంకటగిరికి చెందిన ఆటోడ్రైవర్‌  పిచ్చుక మజ్జియ్య(23) గతేడాది తెలంగాణ నుంచి వస్తూ రెండు మందు బాటిళ్లు వెంట తెచ్చుకుంటున్నాడు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిలకల్లు వద్ద తనిఖీల సందర్భంలో పోలీసులకు పట్టుబడ్డాడు. పెట్టీ కేసు పెట్టి విడిచి పెట్టేశారు. తాజాగా మంగళవారం ఉదయం మజ్జియ్యకు శివ అనే కానిస్టేబుల్‌  ఫోన్‌చేసి కేసు విషయం మాట్లాడాలి..ఆధార్‌కార్డు తీసుకుని రమ్మని చెప్పగా వెళ్లాడు. అయితే కేసు మాఫీ చేసినందున రూ.లక్ష ఇవ్వాలని యువకుడిని సదరు కానిస్టేబుల్‌ డిమాండ్‌ చేశాడు. లేకపోతే గంజాయి కేసు బుక్‌చేస్తానని బెదిరించాడు.

దీంతో తీవ్ర భయాందోళనలకు గురయిన మజ్జియ్య బుధవారం వెంకటగిరిలోని అమ్మమ్మ ఇంటిలో ఫ్యాన్‌కు స్కార్ఫ్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి, ఎస్‌ఐ శివాజీ, ఎస్‌బీ ఎస్‌ఐ గౌరినాయుడు వివరాలు సేకరిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువకుడిని డబ్బులు డిమాండ్‌ చేసింది ఎవరు? 2 బాటిళ్లతో దొరికితే.. 5బాటిళ్లు అని కేసు ఎందుకు పెట్టారు? తదితర విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top