Andhra Pradesh: Young Man Deceased Araku Valley Road Accident In Lakkavarapukota - Sakshi
Sakshi News home page

‘అరకు’ ఆనందం... అంతలోనే విషాదం

Oct 30 2021 8:41 AM | Updated on Oct 30 2021 10:03 AM

Young Man Deceased in Road Accident At Lakkavarapukota - Sakshi

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు ధనేష్‌ (ఫైల్‌) 

యువకులందరూ అరకు అందాలు చూద్దామని బైక్‌లపై సందడిగా బయలు దేరారు. కేరింతలు కొడుతూ ఆ రోడ్లపై ‘రయ్‌’మని అరకు వైపు దూసుకుపోతున్నారు. అంతలోనే ఆ యువకులకు రోడ్డు మరమ్మతుల రూపంలో మృత్యువు ఎదురైంది. అంతే ఉరకలేసే ఆ ఉత్సాహంపై ఉగ్రరూపం చూపించింది. అందులో ఒకరిని ఘటనా స్థలంలోనే ఊపిరితీసేయగా... ఇంకొకరిని చావుబతుకుల మధ్యకు నెట్టివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. 

సాక్షి, లక్కవరపుకోట: కన్న తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా అరుకు అందాలను తిలకించేందుకు బయలుదేరిన ఆ యువకుల జీవితాలను రోడ్డు ప్రమాదం రూపంలో ఛిద్రం చేసింది. ఓ యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందగా మరో యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి హెచ్‌సీ జి.శ్రీనువాస్‌రావు, మృతుడి  బంధువులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన పేర్ల ధనేష్‌ (22), గాజువాకకు చెందిన ఎం.గుణశేఖర్‌లు తమ స్నేహితులతో కలిసి ఆరకు ఆందాలు చూసేందుకు బైక్‌లపై గురువారం అర్ధరాత్రి పయనమయ్యారు.

చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా డాక్టర్‌ సహా ముగ్గురి దుర్మరణం) 

పేర్ల ధనేష్, గుణశేఖర్‌లు ఒక బండిపై వెళ్తుండగా లక్కవరపుకోట పాత జంక్షన్‌ సమీపంలో అసంపూర్ణంగా నిర్మించి వదిలేసిన బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి బైక్‌ వేగాన్ని అదుపు చేసుకోలేక రోడ్డు మధ్యలో ఉన్న మట్టిదిబ్బను ఢీకొట్టారు. దీంతో బైక్‌ నడుపుతున్న ధనేష్‌ కుడి కాలు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. వెనుక కూర్చున్న గుణశేఖర్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన మిత్రులు క్షతగ్రాత్రులను ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధనేష్‌ మృతి చెందాడు. గుణశేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. మృతుడి తండ్రి విశాఖ  స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ ఇటీవల మృతి చెందగా పెద్ద కుమారుడైన ఈయనకు ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇచ్చారు. భర్త పోయి బాధతో ఉన్న ఆ తల్లికి ఆదుకుంటాడనుకున్న కొడుకు అంనంత లోకాలకు వెళ్లి పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతుడి చిన్నాన్న శ్రీనువాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీజీ శ్రీనువాస రావు తెలిపారు. 

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య ఫలితమే...  
ఈ బ్రిడ్జి పనులు 2018 సంవత్సరంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. సంబంధిత కాంట్రాక్టర్‌ కానరాకుండా పోయాడు. బ్రిడ్జి ప్రవేశంలో కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో అటుగా వెళ్లినవారికి పనులు ఆగిపోయిన విషయం తెలియక పోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ బ్రిడ్జి వద్ద 12 మంది అరకు వైపు వెళ్లే పర్యాటకులు మృతి చెందారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టాలని పలువురు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement