యువకుడి దారుణ హత్య.. 70 రోజుల తర్వాత..

Young Man Assassinated For Not Returning Debt Money At Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ రంగస్వామి కథనం ప్రకారం.. ధరూరు మండలం చిన్నపాడుకు చెందిన సాయికుమార్‌(21) తన భార్యతో కలిసి గద్వాలలోని బీసీకాలనీలో నివాసం ఉంటున్నాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ తన అక్క, బావ ఇంటి వద్ద (అదే కాలనీలో) ఉంటుండగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో మే 11న ర్యాలంపాడు రిజర్వాయర్‌ వద్దకు సాయికుమార్, శ్రీకాంత్‌ ఇద్దరు కలిసి విందు చేసుకునేందుకు సాయికుమార్‌ బైక్‌పై వెళ్లి రిజర్వాయర్‌ ప్రాంతంలో గుట్ట మద్యం తాగారు. ఆ తర్వాత తనకు ఇవ్వాల్సిన రూ.25 వేలు ఇవ్వాలని శ్రీకాంత్‌ అడగగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఆగ్రహించిన శ్రీకాంత్‌ మద్యం బాటిల్‌ను పగులగొట్టి సాయికుమార్‌ గొంతులో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సాయికుమార్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌ పక్కనే ఉన్న గోతిలో శవాన్ని పూడ్చి బైక్‌పై తిరిగి వచ్చి బెంగళూరు వెళ్లిపోయాడు. సాయికుమార్‌ కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లేకపోయింది. ఈ నెల 3న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి అన్ని కోణాల్లో రేవులపల్లి ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌ నేతృత్వంలో విచారణ చేపట్టారు. 

బైక్‌ వివరాల ఆధారంగా.. 
హత్య జరిగిన తర్వాత శ్రీకాంత్‌ బైక్‌ను రేవులపల్లికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలకు కుదువ పెట్టారు. ద్విచక్రవాహనాన్ని కుదువ పెట్టుకున్న వ్యక్తి ఆర్‌సీ వివరాలను పరిశీలించగా చిన్నపాడుకు చెందిన సాయికుమార్‌ వివరాలు రావడంతో అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. క్లూస్‌ టీం సాయంతో విచారణ వేగవంతం చేసి శ్రీకాంత్, మరో వ్యక్తిని విచారించారు. సాయికుమార్‌ను తానే హత్య చేశానని శ్రీకాంత్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ర్యాలంపాడు రిజర్వాయర్‌ వద్ద పాతిపెట్టిన సాయికుమార్‌ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దరాయప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఐ చంద్రశేఖర్, గట్టు, మల్దకల్‌ ఎస్‌లు పవన్‌కుమార్, శే ఖర్, ధరూరు తహసీల్దార్, పోలీసులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top