సైబర్‌ క్రైమ్‌లో మరో కోణం! 

Womens Traped By Online Job Fraud People In Hyderabad - Sakshi

ఉద్యోగం పేరుతో నగర యువతికి ఎర 

పనిలో క్వాలిటీ లేదంటూ బెదిరింపులు 

రూ.1.5 లక్షలు కాజేసిన నిందితుడిపై కేసు 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో ఉద్యోగాల పేరుతో ప్రటకనలు ఇవ్వండి.. ఫోన్‌ ఇంటర్వ్యూల పేరుతో హడావుడి చేయడం.. నకిలీ ఆఫర్‌ లెటర్లు, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చి అందినకాడికి దండుకోవడం.. ఇలాంటి సైబర్‌ నేరాలను తరచూ చూస్తూనే ఉంటాం. అయితే శుక్రవారం సిటీలో ఓ కొత్త తరహా సైబర్‌ క్రైమ్‌ వెలుగులోకి వచ్చింది. ఓ యువతికి ఆన్‌లైన్‌లో ఉద్యోగం ఇచ్చిన నేరగాళ్లు ఆమె పనిలో క్వాలిటీ లేదంటూ బెదిరించి రూ.1.5 లక్షలు కాజేశారు. బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేట్‌కు చెందిన ఓ యువతి ఉన్నత విద్యనభ్యసించారు. ఆమెకు కొన్ని రోజుల క్రితం ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. రోటీన్‌ పనులకు భంగం కలగకుండా, తమ కోసం రోజులో కొద్ది సమయం కేటాయించాలని, అలా తాము చెప్పే ఉద్యోగం చేస్తే మంచి జీతం ఇస్తామంటూ ఆమె ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది.

దాన్ని చూసిన బాధితురాలు ఆ నంబర్లను సంప్రదించింది. సైబర్‌ నేరగాళ్లు ఆమెకు డాటా ఎంట్రీ వర్క్‌ అప్పగించారు. అతవలి వ్యక్తులు పంపిన వర్క్‌ను ఆమె నిర్ణీత సమయంలో పూర్తిచేసి పంపింది. వర్క్‌లో క్వాలిటీ రాలేదని, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించావంటూ పేర్కొన్నారు. దీని వల్ల తమకు జరిగిన నష్టంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామంటూ బెదిరించారు. నకిలీ లీగల్‌ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో బెదిరిపోయిన ఆమె వారు చెప్పినట్లే రూ.1.5 లక్షలు చెల్లించింది. అయినా ఆగకుండా మరికొంత మొత్తం కావాలంటూ బెదిరిస్తుండటంతో శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

మరో రెండు ఘటనల్లో.. 
ఎర్రమంజిల్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇండియా మార్ట్‌లో ఏసీలు కొనాలని భావించారు. ఇంటర్‌నెట్‌ నుంచి తీసుకున్న ఫోన్‌ నంబర్‌లో సంప్రదించగా.. ఏసీలు పంపిస్తామంటూ నమ్మబలికిన నేరగాళ్లు రూ.99 వేలు కాజేశారు. వెంకటరమణ కాలనీకి చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఓ వస్తువును ఖరీదు చేశారు. నెల రోజులకూ అది తనకు చేరకపోవడంతో ఆ సంస్థను సంప్రదించాలని భావించాడు. వారి నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసి అందులో ఉన్న నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ తీసుకున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని ఖాతానుంచి రూ.1.55 లక్షలు కాజేశారు. ఈ రెండు ఉదంతాల పైనా కేసులు నమోదయ్యాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top