అత్తారింటికి వచ్చి.. బావిలో పడి ఇద్దరు అల్లుళ్ల మృతి 

Vikarabad District Tandur 2 Son In Law Fell Into Well And Death - Sakshi

కొత్లాపూర్‌లో విషాదం

తాండూరు రూరల్‌: అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు బావి లో ఈతకు వెళ్లి మృ త్యువాత పడ్డారు. ఓ వ్యక్తి నీట మునిగిపో తుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరొకరు కూడా మృత్యువాతపడ్డాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబీకుల కథనం ప్రకారం.. కొత్లాపూర్‌కు చెందిన వడ్డె వెంకటప్ప, శ్యామప్ప అన్నదమ్ములు. వెంకటప్ప కూతురు మాధవిని తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన కృష్ణ(31)కు ఇచ్చి వివాహం చేశారు. శ్యామప్ప కూతురు రేణుకను యాలాల మండలం గిరిజాపూర్‌కు చెందిన మహిపాల్‌(25) వివాహం చేసుకున్నాడు.

కృష్ణ, మహిపాల్‌ కోత్లాపూర్‌ సమీపంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తూ అక్కడే ఉండే వారు. కొన్నిరోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఉగాది పండుగ కోసం కృష్ణ, మహిపాల్‌ కుటుంబాలు 2 రోజుల క్రితం కొత్లాపూర్‌కు వచ్చాయి. ఆదివారం ఉదయం మల్కాపూర్‌ గ్రామంలో ఓ పాలిషింగ్‌ యూనిట్‌ యజ మాని వద్ద పని మాట్లాడేందుకు కుటుంబీకులతో కలసి వెళ్లారు. సోమవారం నుంచి పనికి వస్తామని యజమానికి చెప్పారు. అనంతరం కృష్ణ, మహిపాల్‌ ఇద్దరూ కల్లు తాగారు. తర్వాత బావమరిది నర్సింహులుతో కలసి కొత్లాపూర్‌ సమీపంలో రైతు పెంటయ్య బావిలోకి ఈతకు వెళ్లారు. మహిపాల్‌కు ఈత రాకపోవడంతో నడుముకు డబ్బా కట్టుకొని బావిలో దూకాడు. ప్రమాదవశాత్తు అతడు నీటిలో మునిగిపోతుండగా గమనించిన కృష్ణ వెంటనే అతడిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు.

ఇద్దరూ కల్లు మత్తులో ఉండటంతో ఊపిరి ఆడక నీటమునిగి మృతి చెందారు. నర్సింహులు ఇది గమనించి గ్రామంలోకి వెళ్లి కుటుంబీకులకు విషయం తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మోటార్లతో నీటిని తోడి మహిపాల్, కృష్ణ  మృతదేహాలను బయటకు తీశారు. బతుకుదెరువు కోసం వచ్చిన కృష్ణ, మహిపాల్‌ మృతిచెందడంపై కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కృష్ణకు భార్య మాధవి, పిల్లలు అరవింద్‌ (7), భాగ్యశ్రీ (4) ఉన్నారు. మహిపాల్‌కు భార్య రేణుక, కూతురు అశ్విని (2) ఉన్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top