నగరంలో చోరీ.. తాండూరులో అమ్మకం 

Vikarabad District Police Arrested Gang Of Thieves Stealing Bikes - Sakshi

తాండూరు: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వికారాబాద్‌ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సోమవారం తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. యాలాల మండలం, కమాల్‌పూర్‌ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్, మ్యాతరి భాస్కర్, మ్యాతరి శివ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు.

జల్సాలకు అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. నాలుగు నెలలుగా వాహనాలు అపహరిస్తూ.. మధ్యవర్తుల సాయంతో తక్కువ ధరకు తాండూరులో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు దొంగిలించారు. మాదాపూర్‌ పరిధిలో ఐదు బైకులు, కూకట్‌పల్లిలో రెండు బైకులు, ఒక ఆటో, మియాపూర్‌లో రెండు బైకులు, బంజారాహిల్స్‌ ప్రాంతంలో మూడు బైకులు, సనత్‌నగర్‌లో రెండు బైకులు, బాచుపల్లి ప్రాంతంలో ఒక ఆటో, చందానగర్‌లో మూడు, యూసుఫ్‌గూడలో ఒక బైక్‌ చోరీ చేశారు.

యాలాల మండలంలోనూ రెండు బైకులను దొంగిలించారు. ఇందులో 9 ద్విచక్రవాహనాలను పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన బోయిని ఆనంద్‌కు  విక్రయించారు. మరో నాలుగు ద్విచక్రవాహనాలను యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పలి మహిపాల్‌కు విక్రయించారు. మిగతా వాటిలో బోయిని శ్రీకాంత్‌ వద్ద 3 బైకులు ఒక ఆటో, మ్యాతరి భాస్కర్‌ ఇంటి వద్ద 2 బైకులు, మ్యాతరి శివ ఇంటి వద్ద 2 బైకులు, ఒక ఆటోను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాలను కొనుగోలు చేసిన ఆనంద్, మహిపాల్‌లపై కేసు నమోదు చేశామన్నారు.  

దొరికారిలా..  
యాలాల పీఎస్‌ పరిధిలో 2 ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18న యాలాలలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను ఆపి పత్రాలు అడిగారు. వీరు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని, విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కేసును ఛేదించిన రూరల్‌ సీఐ రాంబాబు, యాలాల ఎస్‌ఐతో పాటు బృందాన్ని అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.  

(చదవండి: అదృశ్యమైన బాలిక సెల్లార్‌ గుంతలో అదృశ్యమైంది)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top