అదృశ్యమైన బాలిక సెల్లార్‌ గుంతలో శవమై తేలింది  | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలిక సెల్లార్‌ గుంతలో శవమై తేలింది 

Published Tue, Sep 20 2022 9:05 AM

Missing Girl Found Dead In Cellar Pit  At Gachibowli  - Sakshi

గచ్చిబౌలి: అదృశ్యమైన బాలిక సెల్లార్‌ గుంతలో శవమై తేలిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన  నాణు, హీరాబాయి దంపతులు నగరానికి వలస వచ్చి గోపన్‌పల్లిలోని ఎన్‌టీఆర్‌నగర్‌లో ఉంటున్నారు. నాణు ఆటో  డ్రైవర్‌గా, హీరాబాయి హౌస్‌మేడ్‌గా పని చేస్తున్నారు.

వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు రమావతి రాణి(17) యూసూఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం తెల్లవారు జామున ఎన్‌టీఆర్‌నగర్‌లోని సిరీస్‌ సంస్థకు సంబంధించిన సెల్లార్‌ గుంతలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని బయటికి తీసి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక కార్పొరేటర్‌ గంగాధర్‌ రెడ్డి పరామర్శించారు.  

పరిహారం చెల్లించాలని ఆందోళన  
14 ఏళ్ల క్రితం సెల్లార్‌ గుంతను తవ్వి వదిలేశారని, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని స్థానికులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహంతో సెల్లార్‌ గుంత వద్ద ఆందోళన చేపట్టారు.  పోలీసులు ఇటు బాధితులు అటు సైట్‌ యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలించ లేదు.

దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.  సాయంత్రం 7 గంటల వరకు ఆందోళన కొనసాగించడంతో దిగివచి్చన యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అంగీకరించడంతో వారు ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: లిఫ్ట్‌ అడిగి ఇంజక్షన్‌ గుచ్చి)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement