మంటలు తీవ్రమైన తర్వాతే సమాచారం ఇచ్చారా?

Vijayawada Fire Accident: Police Search For Ramesh Hospital Owner - Sakshi

సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మృతి చెందిన కేసులో నిందితుడు, రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్‌బాబు పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య, భద్రతా సిబ్బంధి నివేదికలను కమిటీల సభ్యులు సిద్ధం చేశారు. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు వాటిని సమర్పించనున్నారు. ఇక స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ‌ప్రమాదం ఘటనలో రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు కమిటీల విచారణలో తేలినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వారు అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వలేదని కమిటీ  నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
(‘పర్‌ఫెక్ట్‌’వల్లే శానిటైజర్‌ మరణాలు)

మంటలు చెలరేగిన తర్వాత ఫైర్‌కి సమాచారం ఇచ్చినందువల్లే ప్రమాదస్థాయి పెరిగిందని తెలిసింది. అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే ప్రాణనష్టం జరిగినట్టు కమిటీ సభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని కమిటీ సభ్యులు నిర్దారించారు. దీంతోపాటు కరోనా రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు, అనుమతికి మించి రోగులను చేర్చుకున్నట్టు వారి కమిటీ సభ్యులు గుర్తించినట్టు తెలిసింది. స్వర్ణ ప్యాలెస్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని కమిటీ తేల్చినట్టు తెలిసింది. కలప, ఫైబర్‌తో చేసిన ఇంటీరియర్ డెకరేషన్‌కు శానిటైజేషన్ ఎక్కువగా చేయడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని విద్యుత్ శాఖ తేల్చింది.
(అగ్ని ప్రమాదం ఘటనలో నిందితులకు రిమాండ్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top