వ్యథలా..  చందమామ కథలా?

Verdict Complaint To Cyber Crime Police In Hyderabad - Sakshi

‘నా ఫొటోలు ఎక్కడో ఉన్నాయని ఎందరో చెబుతున్నారు. అవి ఎక్కడో ఏంటో మీరే తెలుసుకుని తీసేయండి’ , ‘నేను ఫలానా హీరోకు ఆన్‌లైన్‌లో డబ్బులిచ్చా. వెంటనే కేసు పెట్టి అవి వసూలు చేయండి’,  ‘కెనడా ప్రభుత్వం నా మీద సాంకేతిక నిఘా పెట్టింది. వాళ్లు నా బ్రెయిన్‌లో పెట్టిన చిప్స్‌ తీసేయండి’ ,  ‘ఆస్తి కోసం నా కళ్లల్లో కెమెరా పెట్టిన వాళ్లను పట్టుకోండి. ఎలాగైనా సరే ఆ కెమెరాలు బయటపడేయండి..’ 

సాక్షి, హైదరాబాద్‌: ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? గడచిన కొన్నాళ్లుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు షాక్‌ ఇస్తున్న పలువురి ఫిర్యాదులు. వీరిలో కొందరైతే కమిషనర్‌ కార్యాలయం, మంత్రుల వరకు వెళ్లి చుక్కలు చూపించారు. ఈ తరహాకు చెందిన నలుగురు ‘బాధితులు’ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను చిత్రంగా ‘వేధించారు’. ఆయా ఫిర్యాదులు చందమామ కథల్ని తలపించేరీతిలో ఉండటం గమనార్హం. ఆ కథలు.. పోలీసుల వ్యథలు ఇలా ఉన్నాయి.. 

ఆ మాత్రం తెలుసుకోలేరా.. 

 కొన్ని రోజుల క్రితం సిటీ సైబర్‌ పోలీసులను ఓ మహిళ ఆశ్రయించింది. తాను సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినట్లు పరిచయం చేసుకుంది. తనకు తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఇటీవల ఫోన్లు చేస్తున్నారని, ‘నీ ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి’ అంటూ చెబుతున్నారని మౌఖికంగా ఫిర్యాదు చేసింది.

మీ అనుమతి లేకుండా పొందుపర్చారా? ఏయే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయి? లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తారా? అంటూ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ‘కంప్లైంట్‌ ఇవ్వను... ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా?’ అంటూ సమాధానం ఇచ్చింది.  

   దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పంపారు. అంతటితో ఆగని ఆమె నేరుగా కమిషనరేట్‌లో ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడి అధికారులు ఓ మహిళా కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి సైబర్‌ ఠాణాకు పంపారు. రెండోసారి వచ్చినప్పుడు ‘నా ఫొటోలు ఎక్కడో ఉన్నాయి. అది ఎక్కడో తెలుసుకుని మీరే తొలగించండి’ అంటూ చెప్పింది. దీంతో తోడుగా వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ అసలు విషయం తెలుసుకుని ఉన్నతాధికారులకు చెప్పారు. ఈ ‘బాధిత మహిళ’ను పంపడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నానా పాట్లు పడ్డారు. 

బ్రెయిన్‌లో చిప్స్‌.. కళ్లల్లో కెమెరా అంటూ.. 

 గడచిన కొన్ని నెలల్లో ఈ రెండింటితో పాటు మరికొందరు విచిత్ర ఫిర్యాదుదారులూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చుక్కలు చూపించారు. హఠాత్తుగా ఠాణాకు వచ్చిన ఓ వ్యక్తి తాను కెనడాలో చదువుకుని, ఉద్యోగం చేసి వచ్చానని అధికారులకు చెప్పాడు. తన మేధస్సు ఇతర దేశాలకు ఉపయోగపడకూడదని ఆ ప్రభుత్వం నిఘా వేసిందని వివరించాడు. దీనికోసం బ్రెయిన్‌లో చిప్స్‌ ఏర్పాటు చేసిందని, అవి తీసేందుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో అధికారులకు అవాక్కయ్యారు.  

 మరో విద్యాధికుడైన యువకుడు తన బంధువుల పైనే ఫిర్యాదు చేశాడు. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన కళ్లల్లో కెమెరాలు పెట్టిన వాళ్లు ఎక్కడికి వెళ్తున్నానో కంప్యూటర్‌ ద్వారా తెలుసుకుంటున్నారని చెప్పాడు. తక్షణం కేసు నమోదు చేసి ఆ కెమెరాలు తీయించడంతో పాటు బంధువును జైలుకు పంపాలన్నాడు. అనునిత్యం చిన్న చిన్న చిత్రమైన ఫిర్యాదులూ తమకు వస్తుంటాయని, ఓర్పుతో వారిని వెనక్కు పంపుతున్నామని ఓ అధికారి తెలిపారు.  

ముందు హీరో పేరు.. ఆపై పోలీసులే అంటూ.. 

► సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ షాక్‌ తగలడానికి కొన్నాళ్ల ముందు మరో చిత్రమైన ఫిర్యాదుదారు ముప్పతిప్పలు పెట్టారు. నగరానికి చెందిన ఓ మహిళ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌కు వరుసగా కొన్నాళ్లు వచ్చారు. తొలుత కొన్ని రోజుల పాటు ఏమీ మాట్లాడకుండా వచ్చి, కూర్చుని వెళ్లిపోయేవారు. ఆమెకు ఎదురైన ఇబ్బంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అధికారులు ఆమెను అడిగారు.  

 ఓ పెద్ద హీరోకు తాను ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించానని, ఆ మొత్తం తిరిగి ఇప్పించాలంటూ ఆమె చెప్పడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఇచ్చారు? ఆధారాలు ఏమున్నాయని? పోలీసులు కోరడంతో  ‘బాధితురాలి’కి చిర్రెత్తుకొచ్చింది. మరుసటి రోజు నేరుగా ఓ మంత్రి కార్యాలయానికి వెళ్లింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి పోలీసులే డబ్బు అడిగారని ఫిర్యాదు చేసింది. ఆ కార్యాలయం ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈమెను ఠాణాకు రాకుండా చేయడానికి పోలీసులు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top