భార్య కళ్లేదుటే ఘోరం..చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ..

Tusker Vehicle Hit The Couple Husband Dead At A Hyderguda  - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: ‘మరో నెల రోజుల్లో ఇంటికి వస్తా. అక్కడే ఏదో ఒక పని చేసి బతుకుదాం.. పిల్లాపాపలతో అందరం హాయిగా ఉందాం’ అని చెప్పిన భర్త.. తన కళ్ల ముందే అసువులు బాయడంతో ఆ ఇల్లాలు విలపించిన తీరు అందరి గుండెలను కదిలించింది. ఒంటి నిండా తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న భర్తను కాపాడాలని కనిపించిన వారి కాళ్లా వేళ్లా పడింది.

కానీ.. కట్టుకున్న వాడి ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఈ హృదయ విదారక ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా సేడం మండలానికి రతన్‌ (35), మంజూల (32) భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం.  

స్థానికంగా పనులు లేకపోవడంతో.. 
ఏడాది క్రితం బతుకుదెరువు కోసం రతన్‌ నగరానికి వలస వచ్చాడు. పాండురంగానగర్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా కూలీ పని చేస్తున్నాడు. ప్రతి నెలా సొంతూరికి వెళ్లి భార్యకు డబ్బులు ఇచ్చి వచ్చేవాడు. కూలీ పనులు దొరక్కపోవడంతో రెండు నెలలుగా గ్రామానికి వెళ్లడం లేదు. దీంతో ఆయన భార్య మంజుల మూడు రోజుల క్రితం భర్త వద్దకు వచ్చింది.

రెండు రోజులు భర్తతో ఉండి అప్పటి వరకు జమ చేసిన డబ్బులు తీసుకుని సోమవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మరో నెల రోజులు ఇక్కడే పని చేసి వచి్చన డబ్బుతో తానే వస్తానని భార్యకు చెప్పాడు. ఇక్కడ అంతగా పని దొరకడం లేదని గ్రామానికి వచ్చి పని చేసుకుని మీతోనే ఉంటానన్నాడు.  

దూసుకు వచ్చి మృత్యువు.. 
సోమవారం ఉదయం భార్యభర్తలు ఇదే విషయం మాట్లాడుకుని హైదర్‌గూడలోని బస్టాప్‌ వద్దకు చేరుకున్నారు. బస్టాప్‌ వద్ద ఉదయం 6 గంటలకు నిలుచుని ఉన్నారు. ఇదే సమయంలో ఆరాంఘర్‌ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న టస్కర్‌ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తూ వేగంగా దూసుకువచ్చింది. బస్టాప్‌లో నిలుచున్న దంపతులిద్దరినీ ఢీకొట్టింది.

టస్కర్‌ చక్రాల కింద నలిగిన రతన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి వరకు తనతో నెల రోజుల్లో గ్రామానికి వస్తానన్న భర్త తన కళ్లెదుటే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆమె కన్నీరుమున్నీరుగా రోదించింది. భర్త బతికే ఉన్నాడనుకుని కాపాడండంటూ అక్కడ ఉన్నవారిని ప్రాధేయపడింది. ఆమె అభ్యర్థనలు అతడి ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాదానికి కారకుడైన టస్కర్‌ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.   

(చదవండి: చిన్నపాటి గొడవ..పూలు కట్‌ చేసే బ్లేడ్‌తో యువకుడిని..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top