పెళ్లింట భారీ చోరీ

Thieves Looted Two Crore Worth Properties At Sainikpuri Hyderabad - Sakshi

వజ్రాలహారం సహా రెండు కోట్ల విలువైన నగల చోరీ 

నేపాలీ కాపలాదారుడే కన్నం వేశాడు 

రిసెప్షన్‌కు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల 

సైనిక్‌పురిలో వెలుగు చూసిన ఘటన 

సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల కదలికలు 

కుషాయిగూడ: ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సైనిక్‌పురి డిఫెన్స్‌ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. నర్సింహారెడ్డి చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు.

విందులో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్‌ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్‌ తాళాలు పగులగొట్టాడు. వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం తదితర 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో సాయంత్రం ఏడున్నర గంటలకు రికార్డు అయ్యాయి.  

విందు నుంచి వచ్చేసరికి చిందరవందర 
పెళ్లి, రిసెప్షన్‌ ప్రశాంతంగా జరిగాయన్న ఆనందంలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అక్కడి పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు. రిసెప్షన్‌ పూర్తికాగానే కొంతమంది బంధువులు, కుటుంబసభ్యులు రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. గేటు మూసి ఉండటంతో కాలింగ్‌ బెల్‌ కొడుతూ వాచ్‌మన్‌ను పిలిచారు. ఉలుకూపలుకు లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నర్సింహారెడ్డి వచ్చి ఆభరణాలు, ఇతర పరికరాలు చోరీకి గురయ్యాయని గుర్తించి మరునాడు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి     డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌తోపాటు డాగ్‌స్క్వాడ్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top