breaking news
two crore property
-
పెళ్లింట భారీ చోరీ
కుషాయిగూడ: ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. నర్సింహారెడ్డి చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు. విందులో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్ తాళాలు పగులగొట్టాడు. వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం తదితర 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో సాయంత్రం ఏడున్నర గంటలకు రికార్డు అయ్యాయి. విందు నుంచి వచ్చేసరికి చిందరవందర పెళ్లి, రిసెప్షన్ ప్రశాంతంగా జరిగాయన్న ఆనందంలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అక్కడి పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు. రిసెప్షన్ పూర్తికాగానే కొంతమంది బంధువులు, కుటుంబసభ్యులు రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. గేటు మూసి ఉండటంతో కాలింగ్ బెల్ కొడుతూ వాచ్‌మన్‌ను పిలిచారు. ఉలుకూపలుకు లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నర్సింహారెడ్డి వచ్చి ఆభరణాలు, ఇతర పరికరాలు చోరీకి గురయ్యాయని గుర్తించి మరునాడు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్తోపాటు డాగ్‌స్క్వాడ్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. -
డైఫర్స్ గోదాము అగ్నికి ఆహుతి
రామవరప్పాడు : ఎనికేపాడులోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఎనికేపాడు నుండి కానూరు వెళ్లు ఢొంకరోడ్డులో యూని ఛాం ఇండియా లిమిటెడ్ కంపెనీకు చెందిన ఫ్లై జాక్ లాజిస్టిక్స్ పేరున డైఫర్స్ (మమ్మీ ప్యాకో ప్యాడ్స్)ను గోదాములో నిల్వ ఉంచుతూ డిస్టిబ్యూటింగ్ చేస్తున్నారు. సరుకు నిల్వకు వారం రోజుల క్రితం కానూరు వెళ్లు డొంక రోడ్డులో గోదామును తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలప్పుడు గోదాములో స్టాకుకు నిప్పంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఎగసిపడడంతో అప్రమత్తమైన వాచ్మెన్, ఇన్‌ఛార్జి భాను ప్రసాద్‌కు సమాచారమందించాడు. అంతలోనే గోదాము మొత్తంఅగ్ని కీలలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గోదాములో స్టాక్ ఉంచిన సుమారు రూ. 2 కోట్ల విలువైన సరుకు అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘనా స్థలానికి చేరుకుని జిల్లా ఫైర్ ఆఫీసర్ నిరంజన్‌రెడ్డి , అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో దాదాపు ఐదు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తప్పిన పెను ప్రమాదం త్వరగా అంటుకునే తత్వమున్న డైపర్స్ నిల్వ ఉంచిన ఈ గోదాము నాలుగు వైపులా పెద్ద పెద్ద గోడలతో ఉంది. చుట్టూ ఎతైనా గోడలు ఉండడంతో గాలికి మంటలు పక్కనున్న ఇతర కంపెనీల గోదాములకు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది. షార్టుసర్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండదని పలువురు అనుమానం వ్యక్తబరుస్తున్నారు. ప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.