అన్న పెట్రోల్‌ పోసుకుంటే.. తమ్ముడు నిప్పంటించబోయాడు

Telangana: Farmer Commits Suicide By Pouring Petrol In Bhadradri Kothagudem District - Sakshi

తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం    

చండ్రుగొండ: తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ గిరిజన రైతు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో మంగళవారం జరిగింది. వివరాలివి. మండలంలోని బాల్యాతండాకు చెందిన భూక్య రాధాకృష్ణ, జయకృష్ణ సోదరులకు సర్వే నంబర్‌ 81లో 1.14 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో ఇద్దరూ బోర్లు వేసుకున్నారు. వారి పక్కన వరుసకు సోదరులయ్యే భూక్య రాందాస్, భూక్య దేవి, భూక్య రాజేష్‌కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది.

వాళ్లు కూడా మూడు బోర్లు వేసుకుని సాగు చేస్తున్నారు. రాధాకృష్ణ ఈ ఏడాది మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి వేశాడు. తన భూమి పక్కనే రాందాస్‌ కుటుంబీకులు బోరు బావులు తవ్వించడంతో రాధాకృష్ణ బోరులో నీళ్లు తగ్గాయి. దీంతో రాధాకృష్ణ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌ అనుదీప్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ ఉషా శారద ఈనెల 8న ఆ భూములను పరిశీలించి బోరు బావులను సీజ్‌ చేశారు.

అయితే రాందాస్‌ తదితరులు దొంగతనంగా పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారని రాధాకృష్ణ, జయకృష్ణ ఈనెల 13న గ్రీవెన్స్‌లో మళ్లీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ అన్నదమ్ములిద్దరూ మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కాసేపు ఆందోళన చేశారు. తహసీల్దార్‌ బయటికి రావడంతో ఆమె ఎదుట రాధాకృష్ణ పెట్రోల్‌ పోసుకోగా.. జయకృష్ణ నిప్పంటించే ప్రయత్నం చేశాడు.

దీంతో రెవెన్యూ సిబ్బంది వారిద్దరినీ వారించి బయటికి పంపించారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం తాము చర్యలు తీసుకున్నామని, రాధాకృష్ణ, జయకృష్ణ ఎలాంటి అనుమతులు లేకుండా బోరుబావులు తవ్వించారని చెప్పారు. ఆత్మహత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top