జీన్స్‌ వేసుకుంటానంటే బాలికను కొట్టి చంపేశారు

Teenager thrashed over insistence to wear jeans, dies - Sakshi

డియోరియా: జీన్స్‌ ప్యాంట్‌ వేసుకుంటానని పట్టుబట్టిన ఓ బాలికను ఆమె కుటుంబీకులే కొట్టి చంపారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా సవ్రేజీ ఖర్గ్‌ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నేహా పాశ్వాన్‌ (17) జీన్స్, టాప్‌ ధరిస్తానంటూ మొండికేయగా కుటుంబసభ్యులు సోమవారం ఆమెను తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డియోరియా–కస్య మార్గంలోని పటన్వా వంతెనపై నుంచి విసిరేశారు.

అయితే, ఆ మృతదేహం రైలింగ్‌కు చిక్కుకుని అక్కడే ఉండిపోయింది. గమనించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అమ్మమ్మ, తాత సహా 10 మంది కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, బాలికను జీన్స్‌ వేసుకుంటానని చెప్పినందుకే కోపంతో కొట్టి చంపామంటున్న మృతురాలి కుటుంబసభ్యుల మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన వెనుక వేరే కారణాలు ఉండి ఉండొచ్చుననీ, అవేంటో దర్యాప్తులో వెలుగులో చూస్తాయని చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top