
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు.
ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్‌పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు.