బందరులో టీడీపీ రౌడీ రాజకీయం

TDP rowdy politics in Bandaru - Sakshi

గరాలదిబ్బలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కత్తులు, రాళ్లతో దాడి

ఒకరి పరిస్థితి విషమం, మరో ఐదుగురికి గాయాలు

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

12 మంది టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మచిలీపట్నం టౌన్‌: కృష్ణాజిల్లా బందరు మండలంలో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కత్తులు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన దాడిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి సంబంధించి 12 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం మేరకు.. మచిలీపట్నం మండల పరిధిలోని గరాలదిబ్బలో కొంతకాలంగా ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు తరచూ గొడవలకు దిగేవారు. పలుమార్లు ఘర్షణలు జరిగి కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి ఒడుగు రాజ్‌కుమార్‌ బైక్‌పై వెళ్తున్నాడు.

బహిర్భూమికి వెళ్లిన బొడ్డు నాగరాజు అటుగా వెళ్తుండగా అలికిడి వినిపించి రాజ్‌కుమార్‌ బైక్‌ లైట్‌ని అటువైపుగా తిప్పాడు. బహిర్భూమికి వస్తే నావైపు బైక్‌ లైట్‌ వేస్తావా? అంటూ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ఆ తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. పాతకక్షలను మనసులో పెట్టుకున్న నాగరాజు తన వర్గీయులతో ఆదివారం రాత్రి కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, రాళ్లతో రాజ్‌కుమార్, ఆయన వర్గీయులపై దాడికి తెగబడ్డారు.

మహిళలు, చిన్న పిల్లలని కూడా చూడకుండా రెచ్చిపోయినట్లు స్థానికులు చెప్పారు. నిరీక్షణరావు (24) భోజనం చేస్తుండగానే టీడీపీ శ్రేణులు బరిసెతో పొడిచారు. ఆ బరిసె కన్ను మీదుగా ముఖంపై గుచ్చుకుంది. అదే విధంగా ఒడుగు నాగరాజు, శివరాజు, రాజ్‌కుమార్, ఏడుకొండలు, శివ గాయాలపాలయ్యారు.

పరిస్థితి విషమించడంతో నిరీక్షణరావును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.

దాడికి పాల్పడిన బొడ్డు వీరవెంకటేశ్వరరావు (నాని), బొడ్డు నాగబాబు (చిన్నా), బొడ్డు దుర్గారావు, బొడ్డు నాగేశ్వరరావు, బొడ్డు బాల, బొడ్డు నాగరాజు, బొడ్డు ఏసురాజు, బొడ్డు వెంకటేశ్వరరావు (వెంకన్న), బొడ్డు ఏడుకొండలు (చంటి), బొడ్డు అభిరామ్‌ (రాజు), బొడ్డు వేణుగోపాలరావు (వేణు), బొడ్డు మోషేరాజుపై సెక్షన్‌ 307, 148, 143, 149 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ జి.వాసు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top