పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతల వీరంగం

TDP leaders threats and attacks in AP - Sakshi

పెదపూడిలో ఉపసంహరణ పత్రం చింపేసి ఆర్‌వోపై దౌర్జన్యం

చౌడేపల్లిలో ఎంపీడీవోను బెదిరించిన టీడీపీ నేతలు

పెదపూడి/చౌడేపల్లె: పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం (ఏపీత్రయం) గ్రామంలోను, చిత్తూరు జిల్లా చౌడేపల్లెలోను ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించటమేగాక వారిని బెదిరించారు. హల్‌చల్‌ చేశారు. అచ్యుతాపురత్రయం (ఏపీత్రయం) పంచాయతీలో కరకుదురు 8వ వార్డు మెంబరు పదవికి నామినేషన్‌ వేసిన కూళ్ల లక్ష్మి మంగళవారం తాను ఉపసంహరించుకుంటున్నట్లు ఫారం–7పై సంతకం చేసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) సాయిప్రసాద్‌కి ఇచ్చి రసీదు తీసుకెళ్లారు.

గంట తర్వాత వచ్చి తనతో కొందరు బలవంతంగా ఉపసంహరింపజేశారని ఆర్‌వోకి చెప్పారు. ఆమె వెంట ఉన్న టీడీపీ నేతలు చిన్న అబ్బాయి, వెంకటేష్,  రాము, రాంబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసుప్రసాద్, వీర వెంకట సత్యనారాయణ, పి.వరాహనరసింహస్వామి, నాగతిరుపతిరావు,బుజ్జి జోక్యం చేసుకుని.. తమకు తెలియకుండా ఎలా విత్‌ డ్రా చేస్తారంటూ గందరగోళం సృష్టించారు. టేబుల్‌పై ఉన్న ఫారం–7ను చింపేసి ఆర్‌వోను హెచ్చరించి వెళ్లారు. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల సహాయ అధికారి పి.విజయభాస్కర్‌కు, ఎస్సై టి.క్రాంతికుమార్‌కు ఆర్‌వో సమాచారం అందించారు.
చౌడేపల్లిలో ఎంపీడీవో కార్యాలయం వద్ద అడ్డంగా నిలుచున్న టీడీపీ నేతలు 

విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నేతలపై కేసు
ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలపై చౌడేపల్లె మండలంలో మంగళవారం కేసు నమోదైంది. ఎంపీడీవో వెంకటరత్నం కథనం మేరకు.. ఎంపీడీవో సోమవారం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండగా తెలుగుదేశం నాయకులు ఎన్‌.శ్రీనాథరెడ్డి, జి.రమేష్‌రెడ్డి, ఎ.రామచంద్ర తమ అనుచరులతో కలసి కార్యాలయంలోకి వచ్చారు. తమ పార్టీ నాయకులకు నోడ్యూస్‌ సర్టిఫికెట్లు జారీచేయడానికి పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేరని ఫిర్యాదుచేశారు.

ఎంపీడీవో సమాధానం చెబుతుండగానే వారు దుర్భాషలాడారు. ఆయనతోపాటు పంచాయతీ కార్యదర్శులను బెదిరించారు. దీనిపై ఎంపీడీవో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అందిన ఫిర్యాదు మేరకు ముగ్గురు టీడీపీ నాయకులపై సెక్షన్‌ 353, 506 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణమోహన్‌ చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top