టీడీపీ నేతల రాళ్ల దాడి | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల రాళ్ల దాడి

Published Fri, Jul 1 2022 3:47 AM

TDP Leaders Stones Attack on YCRCP Leaders - Sakshi

వినుకొండ (నూజెండ్ల): గ్రామ దేవత పోలేరమ్మకు పొంగళ్లు పెట్టుకుని ఇంటికి వస్తున్న వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడి కుటుంబం, బంధువులపై టీడీపీ నాయకులు రాళ్లదాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ రూరల్‌ మండలం నడిగడ్డ గ్రామంలో గురువారం జరిగింది. బాధితులు, వినుకొండ పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు పూర్ణి శ్రీను కుటుంబ సభ్యులతోపాటు బంధువులు పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించేందకు మొక్కుబడి ప్రభను కట్టుకుని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.

టీడీపీ నాయకులు బోడేపూడి గోవిందరాజులు, వాసు, సత్యం, కిషోర్, చంద్రబాబు, గాడిపర్తి రాంబాబు, మహేష్, వెంకటేశ్వర్లు, యండ్రపల్లి శ్రీను, కోండ్రు అశోక్, సతీష్, మరో 50 మందికిపైగా జనం వైఎస్సార్‌సీపీ వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన పూర్ణి పెదనాసరయ్య, పాల ఆదిలక్ష్మి, వేల్పుల నాగమల్లేశ్వరి, పూర్ణి నాసరయ్య, బ్రహ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వినుకొండ సి.ఐ. అశోక్‌కుమార్‌ సిబ్బందితో గ్రామలోకి వెళ్లి పరిస్థితులను అదుపు చేశారు. గాయపడినవారిని 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement