రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పట్టాభి

TDP Leader Pattabhi Moved To Rajahmundry Central Jail - Sakshi

రాజమహేంద్రవరం సిటీ: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభిని పోలీసులు శుక్రవారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్‌ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్‌ భద్రత మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు. జైలు అధికారులు లాంఛనాలు పూర్తిచేసిన అనంతరం రిమాండ్‌ ఖైదీగా సెంట్రల్‌ జైలులోకి తీసుకెళ్లారు. 

పట్టాభి బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ 
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభి అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. పోలీసులు జారీచేసిన సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 నోటీసు విషయంలో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందకపోయినా, పట్టాభిని ఎలా రిమాండ్‌కు పంపారని న్యాయమూర్తి జస్టిస్‌ లలిత ప్రశ్నించారు.

ఈ విషయంలో కూడా స్పష్టతనివ్వాలన్నారు. పట్టాభి బెయిల్‌ పిటిషన్‌పై శనివారం విచారిస్తానని న్యాయమూర్తి తెలిపారు. కోర్టు కార్యకలాపాలు మొదలు కాగానే పట్టాభి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. బెయిల్‌ పిటిషన్‌పై లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. పోలీసులు నమోదు చేసిన కేసులో కొన్ని సెక్షన్లు చెల్లవన్నారు. కొన్ని సెక్షన్లు మూడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులని చెప్పారు. పట్టాభి అరెస్ట్‌ విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 ప్రకారం నడుచుకున్నామంటూ పోలీసులు ఓ ఫార్మెట్‌ను కింది కోర్టు ముందుంచారని తెలిపారు.

ఇందులో పలు ఖాళీలు ఉండటంతో మేజిస్ట్రేట్‌ అభ్యంతరం వ్యక్తం చేశారని, అయినా పట్టాభిని రిమాండ్‌కు పంపారని చెప్పారు. అలా ఎలా పంపుతారన్న న్యాయమూర్తి.. దీనిపై ఏమంటారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కె.శ్రీనివాస్‌రెడ్డిని ప్రశ్నించారు. రికార్డులన్నీ కింది కోర్టులో ఉన్నాయని, సమయం ఇస్తే వివరాలు కోర్టు ముందుంచుతానని పీపీ చెప్పారు. న్యాయమూర్తి సానుకూలంగా స్పందిస్తూ పట్టాభి బెయిల్‌ పిటిషన్‌పై శనివారం విచారణ జరుపుతామని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top