టీడీపీ నేత ‘సంబంధం’ బట్టబయలయిందని...

TDP Leader Assassinated Insane Person In Andhra Pradesh - Sakshi

మతిస్థిమితం లేని వ్యక్తి దారుణహత్య 

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం 

ముగ్గురిలో ఇద్దరు నిందితుల అరెస్టు

తాడేపల్లిరూరల్‌: తన వివాహేతర సంబంధం బట్టబయలయిందని ఆగ్రహించిన ఓ టీడీపీ నాయకుడు మరో ఇద్దరితో కలసి మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాంబాబు శనివారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామానికి చెందిన కూరపాటి శేషుకు మతిస్థిమితం లేదు. గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లో నిర్మించిన ఓ కొత్త భవనంలో ఎవరూ లేకపోవడంతో అక్కడే నివాసముంటున్నాడు. హైదరాబాద్‌లో ఉండే ఇంటి యజమాని రెండు ఫ్లోర్లు కలిగిన ఆ నివాసాన్ని తెనాలి మండలానికి చెందిన తెలుగు యువత మాజీ అధ్యక్షుడు శాఖమూరు బాబూ సురేంద్రకు అద్దెకు ఇచ్చాడు. ఆయన రెండో ఫ్లోర్‌ను శ్రీకాంత్‌ అనే మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. పెంట్‌హౌస్‌ను లక్ష్మీకాంత్‌రెడ్డికి అద్దెకు ఇచ్చాడు.

ఈ క్రమంలో ఓ రోజు శాఖమూరు బాబూ సురేంద్ర తన గర్ల్‌ ఫ్రెండ్‌ను గదికి తీసుకొచ్చాడు.  ఆ సమీపంలోనే ఉన్న కూరపాటి శేషు గమనించి గది బయట గడియ పెట్టి పార్కింగ్‌ చేసిన కారు అద్దాలు పగలకొట్టి కేకలు వేశాడు. దాంతో చుట్టుపక్కల వారు వచ్చి శాఖమూరు బాబూ సురేంద్ర రోజుకొక అమ్మాయిని తీసుకొస్తున్నాడని ఇంటి యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో పైముగ్గురూ శేషుకుమార్‌ను విచక్షణా రహితంగా రాడ్‌తో కొట్టి చంపి సురేంద్ర ఇన్నోవా కారులో వారు నివాసముంటున్న ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ దగ్గర నుంచి 6 కిలోమీటర్లు తీసుకొచ్చి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అయితే శేషుకుమార్‌ వివరాలు తెలియక తికమకపడుతున్న పోలీసులకు.. ఓ వలంటీర్‌ అతని వివరాలను అందజేశాడు.
ఇద్దరు నిందితులతో నార్త్‌జోన్‌ డీఎస్పీ రాంబాబు 

ఆ దిశగా విచారణ ప్రారంభించిన పోలీసులు వీరు ముగ్గురే చంపారని నిర్ధారణ కావడంతో లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్‌ను ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శాఖమూరు బాబూ సురేంద్ర పరారీలో ఉన్నాడు. అమర్తలూరులో అతని కారును, వేరే వ్యక్తి వద్ద ఉంచిన అతని సెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా,  బాబూ సురేంద్ర తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ముఖ్య అనుచరుడు కావడంతో అతడ్ని కేసులో నుంచి తప్పించేందుకు మంగళగిరి, తెనాలి టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పోలీసులు ప్రలోభాలకు లొంగకుండా బాబూ సురేంద్రను నిందితుడిగా చేర్చి గాలింపు చర్యలు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top