గౌతమ్‌ కిడ్నాప్‌: ఆ చిన్న తప్పే పట్టించింది | Suryapet Goutham Kidnap Case Details | Sakshi
Sakshi News home page

Nov 16 2020 4:38 PM | Updated on Nov 16 2020 4:46 PM

Suryapet Goutham Kidnap Case Details - Sakshi

సాక్షి, సూర్యాపేట: జిల్లాలో కలకలం సృష్టించిన గౌతమ్‌ కిడ్నాప్‌ కేసు సుఖాంతమయ్యింది. జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి కిడ్నాప్‌కు గురైన బాలుడు గౌతమ్‌ కేసులో పోలీసులు 24గంటల్లోనే బాలుని ఆచూకీ కనుగొని తల్లి ఒడికి  చేర్చారు. సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌లో నివాసముంటున్న మహేష్, నాగలక్ష్మిల కొడుకు మహేష్ శనివారం సాయంత్రం కిడ్నాప్ కు గురయిన సంగతి తెలిసిందే. పండగ సందర్భంగా శనివారం సాయంత్రం పటాకులు కాల్చడం కోసం అగ్గిపెట్టె కొనేందుకు పక్కనే ఉన్న కిరాణా షాపుకు వెళ్లిన గౌతమ్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు. నిన్న మధ్యాహ్నం కిడ్నాపర్లు బాలుడు గౌతమ్ ఇంటి వెనక ఉన్న టైలర్ ఇంటికి ఫోన్ చేసి బాబు గురించి వాకబు చేశారు. కర్నూలులో ఉన్నట్లు చెప్పారు. విషయం తెలిసిన పోలీసులు ఆనెంబర్ ద్వారా వెరిఫై చేయడంతో బాలుని ఆచూకీ లభించింది. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ముగ్గురు యువకులు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ బాస్కరన్ తెలిపారు. (చదవండి: బాలుడి అదృశ్యం కలకలం)

పూర్తిగా సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన గురించి ఎస్పీ బాస్కరన్ తెలిపిన వివరాల ప్రకారం... ‘ముగ్గురు నిందితులు దీపావళి పండుగ రోజు చిన్నారి గౌతమ్‌ని కిడ్నాప్ చేసింది డబ్బుల కోసమే. 13వ తేదీన రెక్కీ నిర్వహించి లాడ్జిలో ఉండి 14వ తేదీన బాబును కిడ్నాప్ చేశారు. శనివారం సాయంత్రం కిడ్నాప్ చేసి మిర్యాలగూడ తీసుకెళ్లారు. ఆ మర్నాడు అక్కడి నుంచి వారిలో ఒక వ్యక్తి గౌతమ్‌ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు. మిగిలిన ఇద్దరు మిర్యాలగూడలో ఉండి గౌతమ్ తండ్రి మహేష్‌కి ఫోన్ చేసి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నిందితులు తమ ఫోన్‌లు కాకుండా రోడ్డుపై వెళ్లే వారి మొబైల్స్‌ తీసుకొని మహేష్‌కు ఫోన్ చేసి ఆతరువాత ఆ నంబర్ బ్లాక్‌లో పెట్టి.. ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేశారు. ఇక పోలీసుల సూచనతో  బాలుడి తండ్రి 7లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. దాంతో ఈ సారి నిందితులు  తమ సొంత ఫోన్‌తో మహేష్‌ నంబర్‌కి రింగ్ చేసి కట్ చేశారు. ఈ చిన్న తప్పే నిందితులను పట్టించింది. ఆతరువాత  మిర్యాలగూడలో కిడ్నాప్ అయితన బాలుడు గౌతమ్‌ని రెస్క్యూ చేశాము’ అని భాస్కరన్‌ తెలిపారు. (తెరపైకి అజీజ్‌ గ్యాంగ్‌: కిడ్నాప్‌ కలకలం)

అనంతరం నిందితుల ఫోన్ నంబర్ ఆధారంగా వారిని గుర్తించి మాచర్లలో అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితులలో ఇద్దరి మైనర్లు కాగా ఒక వ్యక్తి ఉన్నట్లు వెల్లడించారు. కేవలం డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ జరిగిందన్నారు భాస్కరన్‌. ఇక కిడ్నాప్‌కు గురైన తన కొడుకు క్షేమంగా దక్కడంతో బాలుని తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement