నారాయణ ఇంజినీరింగ్‌ కాలేజిలో విద్యార్థి ఆత్మహత్య 

Student suicide in Narayana Engineering College - Sakshi

షాక్‌కు గురై గుండెపోటుతో వార్డెన్‌ మృతి 

హాస్టల్‌ గదిలో ఉరేసుకున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి 

యాజమాన్యం ఒత్తిడే కారణం! 

విద్యార్థి బ్యాగులో కత్తి.. స్వాధీనం చేసుకున్న పోలీసులు  

గూడూరు రూరల్‌ (తిరు­పతి జిల్లా): గూడూరు సమీపంలో ఉన్న నారా­యణ ఇంజినీరింగ్‌ కళా­శా­లలో శనివారం ఒకే రోజు రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇంజినీరింగ్‌ చదువుతు­న్న ఓ విద్యార్థి హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలియడంతో షాక్‌కు గురైన వార్డెన్‌ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనలతో కళాశాల విద్యార్థులు, సిబ్బంది హతాశులయ్యారు. 

పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన ధరణేశ్వరరెడ్డి (21) నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం కళాశాలకు వెళ్ళి వచ్చిన విద్యార్థి గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాత్రి ఈ విషయాన్ని సహచర విద్యార్థులు గుర్తించి వార్డెన్‌ శ్రీనివాసులునాయుడు (57)కు చెప్పారు. దీంతో వార్డెన్‌ షాక్‌కు గురయ్యారు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ని హాస్టల్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యార్థి ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించిన అనంతరం విద్యార్థి మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

విద్యార్థిపై ఒత్తిడి? 
విద్యార్థిని కళాశాల యాజమాన్యం ఒత్తిడికి గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడు రోజులుగా కళాశాలలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) ఇన్‌స్పెక్షన్‌ జరుగుతోందని, ఈ కారణంగా విద్యార్థులను రికార్డుల కోసం, ఇతరత్రా తీవ్రంగా ఒత్తిడికి గురి చేసి ఉంటారని  అనుమానిస్తున్నారు.

గతంలో కూడా ఈ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు అతని కుటుంబంలో కలహాలే కారణమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఇదిలా ఉంటే విద్యార్థి బ్యాగులో ఓ కత్తి ఉండడాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top