
సాక్షి, చెన్నై : వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన ఓ యువకుడు తమ కళ్ల ముందు బుల్లెట్ నడపడాన్ని చూసి ఆగ్రహంతో అగ్రవర్గాలు అతడి చేతులను నరికేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మానామదురై సమీపంలో గురువారం జరిగింది. వివరాలు..మేళపాలయంకు చెందిన రామన్, చెల్లమ్మ దంపతుల కుమారుడు అయ్యాస్వామి శివగంగైలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మరణంతో చిన్నాన్న భూమినాథన్ సంరక్షణలో అయ్యా స్వామి ఉన్నాడు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినప్పటికీ భూమినాథన్ కాస్త స్తోమత కలిగిన వ్యక్తి. దీంతో చిన్నాన్న బుల్లెట్‌లో అయ్యాస్వామి కళాశాలకు తరచూ వెళ్లి వచ్చేవాడు.
తమ కళ్ల ముందు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన యువకుడైన అయ్యాస్వామి బుల్లెట్‌లో గ్రామంలో తిరుగుతుండటాన్ని చూసి అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఆగ్రహంతో ఊగి పోయారు. గురువారం ఉదయం కళాశాలకు బుల్లెట్‌పై వెళ్తున్న అయ్యాస్వామిని అడ్డుకుని అగ్రవర్ణ యువకులు కత్తులతో చేతులను నరికేశారు. వీరి వద్ద నుంచి తప్పించుకుని అయ్యాస్వామి చిన్నాన్న భూమినాథన్ వద్దకు పరుగులు తీశాడు. తక్షణం అయ్యాస్వామిని శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు తెగిన భాగానికి కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో ఆ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వల్లరసు, వినోద్, ఈశ్వరన్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు.